Saturday, June 20, 2026

ధగ ధగ లాడే సూర్యుడిలో మండే కొండలెన్నో 
చల్ల చల్లనైన చంద్రుడిలో నీటి గుంటలెన్నో 
జల జల కురిసే మేఘాలలో ఆవిరి కుండలెన్నో 
పచ్చ పచ్చని పంట భూమిలో తిరిగిన హలాలెన్నో 

రంగు రంగుల పూల వెనుక మొక్క కష్టం ఎంతో 
ఘుమ ఘుమల వంటల కోసం రైతు శ్రమ ఎంతో 
తల తల లాడే చీరల కొరకు నేతన్నల యాతన ఎంతో 
రయ్యి రయ్యిన పోయే బండ్ల శ్రామికుల చెమట ఎంతో 

బ్రతికి బట్ట కట్టిన మన కోసం తల్లి మోసిన భారం తెలుసా
విలాసవంతమైన మన జీవితం కోసం తండ్రి తపన తెలుసా
విజ్ఞానం మనలో నింపడానికి గురువుల త్యాగం తెలుసా
స్వాతంత్ర్యం మనకు అందించటానికి వీరుల రక్తం తెలుసా 

అంతా నేనే అనే అహంకారం నాకే కావాలి అనే ఆరాటం 
ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టే తెంపరితనం 
మూలాలను మర్చిపోయి విపరీత బుద్ధులతో మూర్ఖత్వం 
అందరి శ్రమలను అనుభవిస్తూ అంతా దోచుకొనే స్వార్థం 

ఊరికే ఏదీ రాలేదు ప్రతి సుఖం వెనుక కష్టం ఉంది 
నీవు ఒక్కడివే ఎదగలేదు వెనుక ఎంతో మంది కృషి ఉంది 
ఆనందం స్వార్థంలో లేదు అందరి కోసం చేసే మంచిలో ఉంది 
గొప్పతనం సంపదలో లేదు సమసమాజ నిర్మాణంలో ఉంది 

అనంతమైన విశ్వం పరమార్థం తెలుసుకున్న విజ్ఞానిగా మారు
విశాల హృదయం విలువ తెలుసుకున్న సేవకునిగా మారు
నిజమైన ఆనంద మార్గం కనిపెట్టిన జీవన శాస్త్రవేత్తగా మారు
మరచిపోలేని సేవలు మానవాళికి ఇచ్చిన నాయకునిగా మారు


       - ప్రభాకర రావు కోటపాటి 
          20 జూన్ 2026




No comments:

Post a Comment