Sunday, November 9, 2025

ఈ విశాల విశ్వంలో నీ గమనం ఒక ఘన చరిత్ర కావాలి

ఈ విశాల విశ్వంలో నీ గమనం ఒక ఘన చరిత్ర కావాలి 
నీ ప్రతి ప్రయత్నంలో ప్రజా సేవా సుంగంధాలు విరియాలి 
నీవు నడిచిన నేల నిన్ను తనపై మోసినందుకు మురవాలి 
నీవు నిర్మించిన దారిలో వేలాది మంది గమ్యాలను చేరాలి 

ఎన్ని కోట్లు సంపాదించావో కాదు .. ఎన్ని జీవితాలు మార్చావు?
ఎన్ని ఉత్సవాలు జరిపావో కాదు .. ఎంత మందికి వెలుగయ్యావు?
ఎన్ని సార్లు దేవునికి మొక్కావో కాదు.. ఎన్ని సామాజిక సమస్యలు పరిష్కరించావు?
ఎన్ని సంవత్సరాలు బ్రతికావో కాదు.. పోయిన తరువాత ఎన్ని గుండెలలో ఉంటావు?

బ్రతకటం అంటే అర్థం .. సకల జీవరాశితో అనుబంధం 
ఆనందం అంటే అర్థం .. ప్రకృతి తో కలిసి ప్రయాణం 
జ్ఞానం అంటే అర్థం.. ప్రతి పనిలో విజ్ఞత విలీనం చేయటం 
నాయకత్వం అంటే అర్థం.. నిస్వార్థ మార్గ దర్శకత్వం 

ప్రకృతి నిర్మించిన అద్భుతం మన జీవితం
సమాజం చెక్కిన శిల్పం మన సింహాసనం 
మన మంచి పనులే మన భువన విజయాలు 
అందరి సమస్యలను పరిష్కరించడమే.. అంతిమ లక్ష్యం.

            - ప్రభాకర రావు కోటపాటి 
                9 - నవంబర్ - 2025




Friday, February 7, 2025

రోజు రోజుకూ కలల కోటలను నిర్మిస్తూ కదిలిపో

ఎగుడు దిగుడు దారి నీ ముందున్నపుడు
ఎదురు గాలులు ఉవ్వెత్తున వీస్తున్నపుడు 
ఎటు చూసినా అయ్యోమయ్యంగా ఉన్నప్పుడు
ఎలాగైనా సాధించాలి అనే సంకల్పాన్ని వాడు

అవరోధాలు నీ నడకను నిదానం చేయవచ్చు 
అవి అలుపెరుగని పోరాటంతో దారి ఇవ్వక తప్పదు
నీవు పొందే ఓటమి నీకు తగిలే ప్రతి ఎదురు దెబ్బ
నీలో ధైర్యం నింపాలి. నీ సంకల్పబలం పెరగాలి

నీ ఆశయాలు ఆకాంక్షలు లక్ష్యాలు పెద్ద పెద్ద కలలు
నిరంతరం నీ గుండెల్లో రగిలి దారి చూపే దివిటీలు
కష్టనష్టాల కారుమబ్బులు నలుదిక్కుల కమ్మినపుడు
దారి చూపే వెలుగు నడిపే మెరుపు నీలోనే నిక్షిప్తం 
 
తలపైకెత్తి గుండెల్లో  నమ్మకంతో అడుగులు వేయు
జీవిత పోరాటాన్ని అందరూ అనుసరించేలా చేయి
అడ్డుగోడలు ఆవిరిఅవుతాయి వేదన దరి చేరదు 
విజేత గా విలసిల్లు తావు మార్గదర్శిగా మారుతావు

నీ గుండెను ఉక్కు లాగా మార్చుకో 
నీ దృష్టిని దిక్సూచి లాగా మార్చుకో
అడుగులో అడుగు వేస్తూ లక్ష్యం చేరుకో
రోజు రోజుకూ కలల కోటలను నిర్మిస్తూ కదిలిపో

ప్రభాకర రావు కోటపాటి 
7 Feb 2025


Sunday, January 19, 2025

ధర్మనిరతి,  ధర్మపరిరక్షణ తోనే ఆ ధర్మమూర్తి దర్శనం

ఏడుకొండల స్వామిని ఎలుగెత్తి పిలిస్తే..
ఎదలో కొలువై నెలవై దయతో దీవించడా.
వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం దొరకాలని..  
ప్రాకులాడి ప్రాణాలతో చెలగాటం అవసరమా..

ఎవరో ఏదో చెప్పారని.. నీకేదో దొరకదని..
వేలం వెర్రిగా..గుడ్డిగా నమ్ముతావా..
తొక్కిస లాటలు.. కుమ్ములాటలు..
దేవ దేవుడు అవి చూసి నిన్ను దీవిస్తాడా

ప్రేమ, భక్తి, అనురాగం, ఆసక్తితో ఆహ్వానిస్తే..
సర్వాంతర్యమి కనుల ముందు సాక్షాత్కారం కాడా
నిర్మలమైన మనస్సు.. నిజాయితీ నిండిన నడక
నీ మార్గమైతే ఎల్లప్పుడూ ఆయన నడిపించడా..

ఎన్నో దేవాలయాలు ఎన్నో నామధేయాలు..
అన్ని చోట్ల కొలువై ఉన్నది ఆది నారాయణుడు కాదా
ప్రక్రుతి లో ప్రకాశించే ప్రతి జీవరాశి ఆయన సృష్టి 
సకల జీవులలో ఆ జ్యోతిర్మయుని సందర్శించ లేవా..

నీ దేహమే దేవాలయం.. నీ హృదయమే దేవుని పీఠం
నీవు ప్రక్రుతి కి ప్రాణ కోటి కి చేసే సేవే నిజమైన ప్రార్థన
అనేక పాపాలతో ఆలయంలో ప్రవేశిస్తే ప్రక్షాళన కాదు
ధర్మనిరతి,  ధర్మపరిరక్షణ తోనే ఆ ధర్మమూర్తి దర్శనం



         -- ప్రభాకరరావు కోటపాటి 
                19 జనవరి 2025



Thursday, December 19, 2024

అర్ధం పర్ధం లేని పనులతో వ్యర్థ పదార్థం కావొద్దు

మా అభిమాన కథా నాయకుడంటావు
తన కోసం చొక్కాలు చించుకొంటావు
పనులన్నీ వదిలి తన వెంట పరుగు పెడతావు 
తన కోసం ఇతరులతో గొడవలు పడతావు 
మొదటి ఆట కోసం నీ కష్టాన్ని దారపోస్తావు
నీ శ్రమతో తనని కోటీశ్వరున్ని చేస్తావు

అవసరమా మనకు అర్ధం లేని ఈ ఆరాటం
ఎప్పటికీ తెలుసు కుంటావు ఈ నిప్పులాంటి నిజం

నీ కోసం అహర్నిశలు తపించే తల్లిదండ్రులు
నీ విజ్ఞానం కోసం ఆరాటపడే అధ్యాపకులు
నీ ఆహారం కోసం మండే ఎండలో కష్టించే కర్షకులు
నీ సౌకర్యాల కోసం క్రమశిక్షణ నిండిన కార్మికులు 
నీ రక్షణ కోసం ప్రాణాలు సమర్పించే సైనికులు
నీ భవిష్యత్తు కోసం అన్నీ.వదిలేసే సంఘ సేవకులు

నీ కోసం ఎంత చేస్తున్నారో ఆలోచించావా క్షణకాలం 
వారే నీవు ఆరాధించ వలసిన నిజమైన నాయకులు

నీవు శ్రమిస్తేనే సుఖ సంతోషాలు అవుతాయి సొంతం
నీవు  క్షణ క్షణం సాధన చేస్తేనే చేరుకుంటావు కలల తీరం
నీవు ఏకాగ్రతతో కృషిచేస్తేనే ఎదుగుతావు నిరంతరం 
నీవు అభ్యసిస్తేనే అందుకుంటావు విజయాల శిఖరం 
నీవు విజ్ఞతతో మసలితేనే నడుస్తావు అభివృద్ది పథం

అందుకే
నీ ప్రతి పనిలో పరమావధిని  గుర్తించి ప్రవర్తించు 
నీ ప్రతిభతో లోకం మెచ్చుకొనే దారిలో పయనించు 

ఎవరి స్వార్థం కోసమో నీవు సమిధ గా మారొద్దు 
అర్ధం పర్ధం లేని పనులతో వ్యర్థ పదార్థం కావొద్దు 


                 - ప్రభాకర రావు కోటపాటి 






Sunday, May 12, 2024

తెలుగునాడు కీర్తి ప్రజ్యలింప చేసే కర్తవ్యబద్దులం

తేనెలొలుకు తెలుగుతో తియ్యనైన కవితా ప్రబంధాలు అందించిన నేల తెలుగునాడు

పరవళ్ళు తొక్కే కృష్ణ గోదావరి తుంగభద్ర అనేక నదులకు నెలవైన అమృతధార తెలుగునాడు

అఖండ భారతావనికి అనేక ఆహార పదార్థాలను ధాన్య రాశులను అందించు అన్నపూర్ణ తెలుగునాడు

ఎనలేని త్యాగ ధనులను స్వాతంత్ర్య యోధులను  కవి సామ్రాట్టులను  కన్నతల్లి తెలుగునాడు

తెలుగు ప్రభలను వెలిగించు విద్యా వేత్తలను శాస్త్రవేత్తలను అందించిన సరస్వతిదేవి తెలుగునాడు

కూచిపూడి ఆంధ్రనాట్యం ఒగ్గుకథ బుర్రకథ హరికథ పద్యనాటకం అనేక కళలకు నెలవు తెలుగునాడు

పచ్చని పొలాలు వృక్ష సంపద పక్షి సమూహాలు పర్వత శ్రేణులతో అలరే ఆనందసీమ తెలుగునాడు

నిర్నిబంద నియమపాలకులైన నాయకుల జనరంజక పాలన ఘనచరత్రతో నిండిన జీవనాడి తెలుగునాడు

అజరామర నిరంతర సంపదకు వారసులం మనం
దీక్షానిబద్దులమై పూర్వీకుల పరంపరకు భాద్యులం

తెలుగునాడు కీర్తి ప్రజ్యలింప చేసే కర్తవ్యబద్దులం


      - ప్రభాకర రావు కోటపాటి 
             12 మే 2024

Sunday, April 28, 2024

You are the hero of your own life..

Born into this World.. with empty hands
Struggle for Survival..every where you go
Focus on your goals.. will make you win
Shape your destiny.. solve puzzles of life

You are the hero of your own life..
You can build a life of purpose

Life is a gift of nature.. nurture with care
Your character is everything..fill with values
Don't let failure stop you..step on it and succeed.
You are born for the cause..be curious all the time.

You are the hero of your own life..
You can build a life of purpose

You will find obstacles on your way..
Be obsessed with your potential 
Shortcuts are throat cuts.. 
Sheer patience will solve problems
Perfection is not attainable one day..
Perseverance will realise your dreams
Difficult times bound to greet you..
Dormant forces in you can dominate times

You are the hero of your own life..
You can build a life of purpose

Be part of solutions.. indulge in innovation
Develop toxic positivity.. live in bliss
Make concious choices.. lead by example 
Build sustainable world..become catalyst for change.

You are the hero of your own life..
You can build a life of purpose

        - Prabhakar Rao Kotapati 
                   28 April 2024





Monday, March 18, 2024

వట్టి మాటలు కట్టిపెడదాం..నీటిని కాపాడే విప్లవానికి నాయకులమై నడుద్దాం అందరినీ నడిపిద్దాం.

త్రాగటానికి నీరు.. తల స్నానానికి నీరు..
చేయి కడగటానికి నీరు.. చెట్ల కోసం నీరు..
పల్లు తోమటానికి నీరు.. పండ్లు పండాలంటే నీరు.
వంట కోసం నీరు.. వంట పాత్రలు కడగటానికి నీరు..
నీరు మన జీవితం.. నీరు మన మనుగడకు ఆధారం.

మండుతున్నది భూగోళం మనం వాడే ప్లాస్టిక్ వలన.
విషతుల్యంగా మారే నదీనదాలు విసిరే వ్యర్థాల వలన.
రోజురోజుకూ తరిగిపోయే నీరు బాధ్యతాలేమి వలన.
క్షణ క్షణానికి క్షామం వైపు నీటిపై మననిర్లక్ష్యం వలన.
పేరుకు పెద్దచదువులు నీటిపై  శ్రద్దలేని చిన్నబుద్దులు.

నీరు లేని జీవితాన్ని ఆ నరకాన్ని ఊహించుకో
కోట్లుపెట్టినా కొనలేని ఆ అమృతం విలువ తెలుసుకో
కుండలతో కిలోమీటర్లు నడిచే వారిని గమనించు
ఎడారిగా మారుతున్న భూములను పరిశీలించు
మన అకృత్యాలే ఈఅనర్థాలకు పునాది అర్ధంచేసుకో

ఊపుకుంటూ కొట్టుకు వెళ్తాము.. వందల కొద్దీ ప్లాస్టిక్ సంచులు వేసుకొని తిరిగి వస్తాము..
పంపు తిప్పి పక్క చూపులు.. అనవసరంగా  వేలకొద్దీ గ్యాలన్ల నీటిని వృదా చేస్తాము.
ఒక్క సారి వేసుకొన్న బట్టలు.. ఉతకటానికి వాషింగ్ మెషీన్ నిండా నీటిని వాడతాము.
నీటి సీసాలు మోయటం అంటే నామోషీ.. నీరు ప్లాస్టిక్ సీసాలో త్రాగి ఎడమ చేత్తో విసిరి వేస్తాము.
ఆపాలి కాపాడాలి అని తెలిసినా.. నేనొక్కడినే ఆపితే ఈ లోకం గతి మారుతుందా అని మెట్ట వేదాంతాలు.

జరిగిన తరువాత అయ్యో అమ్మో అంటే అపగలవా?
ముందుచూపు లేకుండా మునిగి పోవటం సరియా?
చేతిలో ఉన్నప్పుడు వదిలేసి లబో దిబో అందామా?
రాబోయే ఉపద్రవం ఆపటానికి నడుం బిగించలేవా?

వట్టి మాటలు కట్టిపెడదాం..నీటిని కాపాడే విప్లవానికి నాయకులమై నడుద్దాం అందరినీ నడిపిద్దాం.


       ప్రభాకర రావు కోటపాటి
        18 మార్చ్ 2024