Saturday, December 9, 2017

ప్రభంజనంలా నీ అడుగులలో నడిచే నవ లోకాన్ని చూస్తావు..

నిర్మలమైన మనసుతో పలకరించు..  నీ చుట్టూ  ఉన్న మనుషుల మంచితనాన్ని చూస్తావు.. 


స్వార్థాన్ని వదిలి వేసి సేవ చేయి.. సాగరమంత విశాలమైన ఆనందాన్ని చవి చూస్తావు.. 


చేసే పని మీద సంపూర్ణ ధ్యాసతో పని చేయి.. చెరిగిపోని నైపుణ్యాలను నీ సొంతం చేసుకొంటావు.. 


ధన సంపాదన తో సంబందంలేని మనసుకు నచ్చే పనులు చేయి.. ధగ ధగ లాడే నీ కలల ప్రపంచాన్ని చూస్తావు.. 


ప్రపంచపు పోకడలను వదిలి నిజాన్ని నిర్భయంగా పాటించి చూడు.. ప్రభంజనంలా నీ అడుగులలో నడిచే నవ లోకాన్ని చూస్తావు..

--



Regards
Prabhakar Rao Kotapati


తిరిగి మరలా వస్తాడు మా నారాయణ రాజు ఈ రోజు

నన్ను దోచుకొందువటే అంటూ తెలుగు వారి మనసు దోచుకొన్న నారాయణుడా.. 


ఉర్దూ భాషలో చదువు మొదలుపెట్టి తెలుగు కే తలమానికముగా మారిన జ్ఞానపీఠమా.. 


తీయనైన భాషతో పగలే వెన్నెల కురిపించి జగమే ఊయలగా మార్చిన పద్మ భూషణుడా.. 


ఏ దేశమేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి గౌరవము అన్న రాయప్రోలు రచనకు మెరుగులు దిద్ది జాతి ఐక్యతా భావాలను జోడించిన దేశ భక్తుడా.. 


కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్య రత్నమా.. 


తెలుగు గజల్ గీతాలను సృష్టించిన సాహిత్య సార్వభౌముడా.. 


గున్నమామిడి కొమ్మ మీదున్న కోయిలా చిలుకల చెలిమితో జాతి కుల మత కుడ్యాలను పగులగొట్టిన దార్శనికుడా.. 


తెలిసిందిలే తెలిసిందిలే అంటూ సులువైన పదాలతో భాషామృత జలధారలను కురిపించిన కళాప్రపూర్ణుడా.. 


ఎన్నో పుస్తకాలు, మరెన్నో కవిత్వాలు, వేలకొద్దీ పాటలు ఇఛ్చిన సర్వస్వతీ దేవి  వరపుత్రుడా.. 


మిమ్ములను కన్న ఈ తెలుగు నేల మురిసిపోవుచున్నది. 

మీరు దేహాన్ని వదిలి వెళ్లారని నమ్మలేక పోవుచున్నది .. 


తిరిగి మరలా వస్తాడు మా నారాయణ రాజు ఈ రోజు అంటూ వేల తారకల నయనాలతో ఈ తెలుగు నేల తమరి రాకకోసం ఎదురు చూస్తున్నది..

--



Regards
Prabhakar Rao Kotapati


Monday, June 12, 2017

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో మురిసెనులే మనసంతా..

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 
మురిసెనులే మనసంతా.. 
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 

ఎండిపోయిన మోడులన్నీ.. చిగురించేను సరికొత్త సొగసులతో
అడుగంటిపోయిన చెరువులన్నీ..   పొంగిపొరలేను కురిసే జలధారలతో

ఈ చినుకులే అమృత ధారలై .. నింపేనులే  ఈ జగమంతా.. పచ్చని మొక్కలతో.. 

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 

పెరిగిన ఆ పచ్చని చెట్లే.. నిండేను పక్షుల కిల కిలలతో.. 
పరుగెత్తే ఆ మేఘాలే .. ఆగి కలిసేను జలపాతాలతో.. 
జర జర పారె ఆ నదులే.. నింపేను భూమిని బంగారముతో

పొంగే పాడి పంటలే జనులకు సొంతమై.. 
విలసిల్లేను అందరూ సుఖ శాంతులతో.. 

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 
మురిసెనులే మనసంతా.. 
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో

Sunday, June 11, 2017

పైర గాలి వీచింది... మేఘమాల పలికింది వాన జల్లు కురిసింది.. వాడిన చెట్టు లేచింది

పైర గాలి వీచింది...  మేఘమాల పలికింది 
వాన జల్లు కురిసింది.. వాడిన   చెట్టు  లేచింది 

భూమి పులకరించింది.. రైతు మనసు రమ్యమయింది.. 
ఎన్నో ఏళ్ళ ఎదురుచూపు.. నిజమై నిలిచింది.. 

మొలకెత్తే విత్తనాలే జన జీవనానికి ఆధారాలు 
వెల్లివిరిసే ఇంద్ర ధనుస్సులే దారి చూపే దివిటీలు.. 

చల్లనైన ఋతుపవనాలు వీస్తుంటే ఎదో తెలియని ఆనందం.. 
పోగుట్టుకొన్న నిధి ఏదో దొరికిందన్న సంబరం.. 

కోట్లిచ్చినా కొనగలమా జీవం నిండిన ఆ జలాన్ని.. 
తలక్రిందులుగా తపస్సు చేసినా తేగలమా రాని తొలకరిని.. 

ఎలినినో రక్కసిని ఎదిరించి గెలిచిన వరుణుడు.. 
మల్లెల వంటి జల్లులను కురిపిస్తుంటే.. 
పంటలన్నీ పచ్చగా కనిపిస్తుంటే.. 
అణిగి పోయిన రైతు ఆశలు చిగురుస్తుంటే.. 
చూడటానికి వేయి కనులు చాలవు.. 

ఇప్పటికయినా అర్ధం కావాలి.. 
ఏలినినో సృష్టికర్తలం మనమేనని 
మనం వదిలే పొగలే మనలను ముంచే మహమ్మారులని.. 

అందుకే మనందరం మారాలి.. 
పర్యావరణాన్ని రక్షించే సైనికుల లాగా.. 
అప్పుడే చూడగలం ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ..

Saturday, June 3, 2017

పది మంది నడిచిందే బాట అవుతుందా? గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

పది మంది నడిచిందే బాట అవుతుందా?
గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

ప్రశ్నించకపోతే ఆంతరార్థం అర్ధమవుతుందా?
మూఢనమ్మకాలలో మునిగిపోతే మార్పు సాధ్యమవుతుందా? 

పొగ తాగితే స్వర్గానికి దగ్గర అవుతావన్నారు.. 
తరువాత తెలిసింది అది రోగాలకు రహదారి అని.. 

మందు తాగితే గాల్లో తేలతావన్నారు.. 
ఆ తరువాత అర్ధమయింది అది అణువణువుని ఆరగిస్తుందని . 

మన కులస్తులతోనే కలిసి తిరగాలన్నారు.. 
కాలక్రమంలో కనువిప్పయింది కులం కన్నా గుణం మిన్న అని.. 

మతానికి వేరు వేరుగా దేవుడుంటాడన్నారు.. 
మహానుభావుల భావాలతో బోధపడింది భగవంతుడొక్కడే అని.. 

డబ్బుతో కొనలేనిది ఏమీ లేదన్నారు.. 
ఎన్నో జీవితాలు చూస్తే జ్ఞానోదయమయ్యింది కాలాన్ని కొనగలిగే కోటీశ్వరుడు లేడని.. 

మనసుకి నచ్చినది తినటమే అనుభవించటమన్నారు.. 
తిన్న తరువాత తెలిసొచ్చింది ఆరోగ్యముంటే కానీ అనుభవించలేమని.. 

కత్తికి కత్తే సమాధానం చెప్పాలన్నారు ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నారు  .. 
పోతున్న ప్రాణాలను గమనిస్తే అనిపిస్తుంది ప్రేమే ఈ ప్రపంచాన్ని కలప గలిగే ప్రాణవాయువు అని.. 

అందుకే.. 

ఎంత మంది చెప్పారు అని కాదు.. 
ఎంత  నిజం చెప్పారు అనేది అర్ధం చేసుకో.. 

గుంపులో గోవింద కొట్టటం కాదు.. 
నీ గుండె చేసే గుస గుసలను గమనించు.. 

సమాజాన్ని మెప్పించడానికి జీవించవద్దు.. 
నిజాలనే నిప్పుతో నీ సమాజానికి వెలుగు చూపించు..

Saturday, May 27, 2017

సుర సుర లాడే సూర్య నారాయణుని కోపానికి కారణమేమిటో

సుర సుర లాడే సూర్య నారాయణుని కోపానికి కారణమేమిటో.. 
పచ్చనైన చెట్ల ఆచూకి కానరాలేదని క్రోధమా.. 

పొట్టలోని నీటిని బిడ్డల కోసం దాచే భూమి భగ భగల భావమేమిటో.. 
వరుణుడిచ్చే వాన నీటిని అపుతున్న ఆకాశ హర్మ్యాలపై ఆలకయిఉంటుంది.. 

నిండు కుండలా ఉండే మేఘాలు మొహం చాటు వేయటం వెనుక రహస్యమేమిటో.. 
తమకు ఊపిరి ఆడకుండా చేస్తున్న పరిశ్రమలొదిలే  పొగల మీద పంతమనుకొంటాను.. 

అడగకుండా అన్ని రకాల ఫలాలను అందించే ఫలవృక్షాల సంతాన లేమికి జరిగిన లోపమేమిటో.. 
ఇంకా ఇంకా కావాలనే తొందరలో వాటికిచ్చిన రసాయనాలను జీర్ణించుకోలేని జుగుప్స కావచ్చు.. 

ఇదంతా చూస్తూ  ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న మనుషుల మూఢ నమ్మకానికి ఆధారమేమిటో.. 
ప్రకృతి ప్రకోపానికి తమ పనులే కారణమని తెలుసుకోలేని తత్త్వం అయిఉంటుంది..

Saturday, May 20, 2017

జనం నీ జీవనంలో అంజనం కావాలి.. ప్రజలు నీ ప్రయాణంలో తోడు రావాలి..

ప్రతి మనిషి ఆలోచన ప్రత్యేకం..
అలా ఉండటమే ఈ సృష్టి ధర్మం.. 
అందరూ మనలాగే ఆలోచించాలి అనుకోవటమే అవివేకం..
అందరి అభిప్రాయాలను ఆదరించటమే ఆదర్శం.. 

ఎదుటి వారు చెప్పేది శ్రద్ధతో వినటం..
వారి వైపునుండి సమస్యను చూడటం..
మనస్పూర్తితో వారి మంచి కోరటం..
ఆవే మంచి మానవసంబందాల వెనుక రహస్యం.. 

నమ్మకమే మనుషులను నడిపించే బలం 
అనుమానమే అందరినీ విడదీసే అంకుశం
తోటివారిని నమ్మాలి తప్పు చేస్తే తెలియచెప్పాలి 
ఎవరినీ నమ్మలేని మనిషే అసలైన ఒంటరి 

మనం తీసుకొనే నిర్ణయాలే మన భవిష్యత్తు 
దూరద్రుష్టి లోపిస్తే వచ్చేదే స్వార్ధమనే మత్తు 
స్వంతలాభం కొంత మనుకొంటే మనుషులందరూ మన బంధువులే.. 
ఇరుగు పొరొగు తో కలిసిపోతే అందరూ మన స్నేహితులే.. 

మనమెంతో సాదించాలి కానీ తోటి వారి కన్నీటితో కాదు.. 
మనకు సుఖాలు కావాలి కానీ ఎదుటి వారిని ఏడిపించి కాదు.. 

జనం నీ జీవనంలో అంజనం కావాలి.. 
ప్రజలు నీ ప్రయాణంలో తోడు రావాలి..

Monday, May 15, 2017

అంతులేని మమకారమే అమ్మ..

అంతులేని మమకారమే అమ్మ.. 
బిడ్డ నవ్వు కోసం అడ్డమైన కష్టాలను ఇష్టంతో భరిస్తుంది అమ్మ.. 

కొడుకును కొండత్త ఎత్తులో చూడాలనుకొంటుంది అమ్మ.. 
పిల్లవాడు ఏమి చెప్పినా నమ్మేది అమ్మ మాత్రమే.. 

కుమార్తె భవిష్యత్తు బాగా ఉండాలని ఆమ్మ కోరుకోని క్షణం ఉండదు.. 
అమ్మాయి ఎంత ఎదిగినా అమ్మకు అమాయకురాలిగానే కనిపిస్తుంది.. 

తన సర్వస్వం పిల్లలకోసం ఇచ్చి వారి పిలుపుకోసం ఎదురు చూస్తుంది అమ్మ.. 
ఇచ్చినది గుర్తు ఉండదు.. తనకేమి కావాలో ఆలోచన ఉండదు.. తన కోసం చేసుకొనే తీరిక ఉండదు.. అమ్మకు 

అటువంటి అమ్మకోసం మనిషి ఏమి చేసినా తన ఋణము తీరదు.. 
ఆమెను బాధించే పనులు చేయటానికి మించిన మహా పాపం ఉండదు..

 ఈ లోకం లో అమ్మను మించి మనిషి మంచి కోరేవారు ఉండరు..

Saturday, May 13, 2017

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి 
నీ అద్భుతాలు వ్రాయటం అసలైన అసాధ్యం..

గింజ గింజను నీ పొట్టలో దాచుకొంటావు.. 
వాటిని మొక్కలుగా మార్చి వృక్ష సంపదను రక్షిస్తావు.. 

మలినమైన నీటిని శుద్ధి చేసే అతి పెద్ద యంత్రానివి నీవు.. 
మరలా మరలా మురికి వదిలించి మంచి నీటిని అందిస్తావు.. 

అనంత కోటి జీవరాశులకు ఆశ్రయం నీవు.. 
అన్ని జీవులకు సరిపడా ఆహారాన్ని అందిస్తావు.. 

అంతం లేని శక్తి సంపద సమాహారం నీవు.. 
చమురు, బొగ్గు, లవణాలు, లోహాలు అన్నింటినీ అందిస్తూనే ఉంటావు.. 

ఎటువంటి పదార్దాన్నైనా నీలో కలుపుకొంటావు.. 
తిరిగి వాటినే పనికి వచ్చే పదార్థాలుగా మారుస్తావు.. 

చెత్తా చెదారాన్ని ప్రేమతో స్వీకరిస్తావు.. 
వాటికి విలువను జోడించి జీవరాశికి అందిస్తావు 

నీవు తర తరాలకు ఇస్తూనే వస్తున్న మహా దాతవు 
సృష్టిస్తావు, పంచుతావు, పునరుజ్జీవింప చేస్తావు.. అంతులేని ప్రేమతో.. 

ఓర్పుకే నిర్వచనం నీవు.. 
మతిలేని మనుషులు చేసే   వినాశనాన్ని వినమ్రంగా భరిస్తావు.. 

నీవు లేకపోతే మాకు భోజనం లేదు.. 
నీవు లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు.. 

యుగ యుగాలుగా నీ నుండి తీసుకొంటూనే ఉన్నాము..
బోధించి, దీవించి మమ్ములను నీ నిజమైన భక్తులుగా మార్చు..

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి.. 
నీవు అణువణువు అద్భుతాల హారానివి.

Earth.. oh my Emazing Earth!

Earth..  oh my Emazing Earth!
Listing your astonishing works is almost impossible..

You keep every seed in your stomach
and Germ them out to maintain generations

You are the big purifier of bad water
and Revives and makes it reusable 

You are home for millions of living organisms
and Keeps food for every creature 

You are the endless energy source 
and Originates oil, gas, coal and minerals

You assimilate any material 
and Convert them as consumables

You welcomes any useless waste item
and Adds value to make it worthfull 

You are the continuous contributor 
and Create, distribute, rejuvenate with endless love 

You peak in patience 
and Tolerates hazardous acts of insensitive Humans

Without you we can't eat..
Without you this world will extinct..

Taken so much from you since generations..
Teach and transform us as your TRUE FOLLOWERS....

Earth..  oh my Emazing Earth!
You are simply splendid!!!!

Sunday, May 7, 2017

అందుకే వదిలివేయు నేను అనే అహాన్ని.. మరచిపోవద్దు మనం అనే మహా మంత్రాన్ని..

పది మంది కలిసి పని చేస్తే పుట్టేది ప్రభంజనం.. 
ఒక్కొక్కరే విడి విడిగా కదులుతుంటే అది ఒంటరి పోరాటం.. 

ఒకరి బలం అందరి బలంగా అయిపోతుంది ఐకమత్యంతో.. 
నేనొక్కడినే అన్నీ చేయగలను అనుకోవటమే అతిపెద్ద అజ్ఞానం.. 

దండుగా కలిసిన చలి చీమలే చంపుతాయి కొండచిలువను.. 
గుంపుగా పేనిన గడ్డి పోచలే కట్టి పడేస్తాయి మద గజాన్ని.. 

మనం తెలుసుకున్న దానిని తోటి వారికి నేర్పటముతోనే వస్తుంది విజయం.. 
అందరిలో మనం మమేకమై సాగితే వచ్చే ఉపాయాలు అనంతం.. 

సొంత లాభాన్ని అందరి లాభంగా మార్చి ఆలోచిస్తే మన చుట్టూ  ఉంటుంది స్వర్గధామం.. 
ఎవరేమైనా పరవాలేదు నేనే అన్ని అందలాలు ఎక్కాలి అనుకోవటంతోనే మొదలు అందరి పతనం.. 

గుంపుగా ఉన్న జీవుల మందనుండి ఒక్క జీవిని సింహం వేటాడలేదు.. 
కలసికట్టుగా జీవించే మనుషులను ఎటువంటి ఎటువంటి దుష్ట శక్తులు వేరుచేయలేవు.. 

పుట్టుకతోనే మనిషి సంఘజీవి.. 
ఆ సంఘాన్ని విస్మరిస్తే అతనే విగత జీవి.. 

మనమెంత గొప్ప అనేది చెప్పుకోవటం కాదు జీవితం.. 
మనమెంతమంది మనుషుల మనుసుల్లో మంచిమనిషిగా జీవిస్తున్నాం అనేదే జీవితం.. 

అందుకే వదిలివేయు నేను అనే అహాన్ని.. 
మరచిపోవద్దు మనం అనే మహా మంత్రాన్ని..

Saturday, April 29, 2017

ఎందరో మహారాజులు.. అందులో కొందరే మహానుభావులు..

ఎందరో మహారాజులు.. 

అందులో కొందరే మహానుభావులు.. 


రాజ్యం కోసం యుద్దాలు చేసిన వాళ్ళు యుగాల మాటున కనుమరుగయ్యారు.. 


ప్రజల కోసం పోరాడిన వారు ప్రపంచ చరిత్రలో చెరగని పుటలలో మిగిలారు.. 


భారత సరిహద్దు రక్షణకు ప్రాణాలొడ్డిన పృథ్విరాజును మరచేది ఎవ్వరు?


సామాన్యులను సింహాలుగా మార్చిన ఛత్రపతి చిరస్మరణీయునిగా మిగిలాడు.. 


దీన్  ఏ ఇల్లాహి తో అన్ని మతాలను కలిపి మానవత్వం కోసమే మతం అన్నాడు అక్బర్ చక్రవర్తి.. 


దక్షిణ భారత హద్దులను హంపీ తో అనుసంధానం చేసిన కృషీవలుడు కృష్ణ దేవరాయలు .. 


సిపాయిల తిరుగుబాటును స్వతంత్ర పోరాటంగా మార్చిన వీర నారి ఝాన్సీ రాణి.. 


ఆబాల గోపాలానికి అహింసను అలవాటుగా మార్చిన మహా మనిషి అశోక చక్రవర్తి.. 


ప్రజా రక్షణ కోసం కఠిన నియమాలు పాటించిన కాకతీయ కాంతి పుంజం రుద్రమదేవి.. 


రాజ్యాలు ఏలటం కాదు గొప్ప.. 

రాబోయే తరాలు గుర్తుంచుకునేలా పాలించటం.. 


కత్తులతో కుత్తుకలు కోయటం కాదు వీరత్వం.. 

కరుడు కట్టిన క్రూరత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం.. 


జనం కోసమే జీవించటం.. 

ప్రేమ నిండిన ప్రపంచాన్ని నిర్మించటం.. 


అదే రాచరికం.. 

అదే నిజమైన క్షత్రియ ధర్మం..

Sunday, April 23, 2017

చేసిన వాడే నమ్మలేనంతగా గొప్ప పనులు సాధింప చేసేవాడు నాయకుడు..

అనుచరులను తయారు చేయాలంటే ఎలా పనిచేయాలో చెప్పు..
నాయకులను తయారు చేయాలంటే ఏ ఫలితాలు కావాలో చెప్పు .. 

నీ సొంతముగా పని పూర్తి చేయాలంటే మెదడుని ఉపయోగించు .. 
నీ తోటి వారితో పనిచేయించాలంటే హృదయాన్ని ఉపయోగించు..

గొప్ప విజయాలు సాధించాలంటే తెలుసుకున్నది పది మందికి నేర్పు.. 
చేసే పనిలోనే జీవితాంతము కొనసాగాలంటే ఇతరులను దూరంగా ఉంచు..

పొరపాటు చేసిన మనిషిని నిందిస్తే మిగిలేది ఉక్రోషం .. 
తప్పు చేసిన మనిషికి తన బాధ్యతలు గుర్తు చేస్తే ఉప్పొంగేది ఉత్సాహం.. 

నీవు నీ స్వలాభం గురించే ఆలోచించుకొంటుంటే అది అంతులేని ఆరాటం.. 
నీవు ఇతరుల కోసం సహాయపడితే జగమంతా నీ కుటుంబం.. 

మనిషికున్న కొంచెము ఆత్మ విశ్వాసాన్ని కూడా హరించేవాడు నిరంకుశుడు.. 
చేసిన వాడే నమ్మలేనంతగా గొప్ప పనులు సాధింప చేసేవాడు నాయకుడు..

గంజాయి విత్తు నాటితే తులసి మొలవదు..

గంజాయి విత్తు నాటితే తులసి మొలవదు.. 
మంచి సంకల్పం లేకపోతే మనుషులు మెచ్చుకొనే పనులు చేయలేము.. 

ఎడారిలో నీరు దొరకదు అనుకొంటే ఖర్జూరం బ్రతకలేదు.. 
ఆత్మ విశ్వాసం లేకపొతే అడుగు ముందుకు వేయలేము.. 

గాలొస్తే పడిపోయే పుల్లలతో అల్లటం అవసరమా అనుకుంటే పక్షి గూడు కట్టుకోలేదు.. 
ఓర్పు లేకపోతే అడ్డుపడే అడ్డంకులను తట్టుకొని సాగలేము.. 

తన బరువుకన్నా ఎక్కువ  మోయటం అవసరమా అనుకొంటే చీమ ఆహారాన్ని సేకరించలేదు.. 
నిరంతర కృషి లేకపోతే ఆలోచనలతోనే  ఆగిపోతాము.. 

ఆకాశంలో ఎగురుతూ క్రింద తిరిగే ఎలుకను చూడగలనా అనుకొంటే గ్రద్దకు కడుపు నిండదు.. 
ఏకాగ్రత తో సాగకపోతే సమున్నతమైన గమ్యాలను గమనించలేము.. 

విజయాన్ని సాధించిన వారికుండే ఐదు లక్షణాలు ఇవే .. 

మంచి సంకల్పం.. ఆత్మ విశ్వాసం.. ఓర్పు.. నిరంతర కృషి.. ఏకాగ్రత..

Monday, April 10, 2017

అప్పుడు అర్ధమయింది నాకు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అయిదు శక్తుల గురించి..

భూమిని చీల్చుకొని పైకొచ్ఛే మొలకనడిగా..  నీకా శక్తి ఎలా వచ్చిందని.. 

ఆకాశాన్ని అందుకోవాలనే అలుపెరుగని ఆరాటం నుండి అంది.. 


మండే  ఎండను తాను భరిస్తూ  చల్లని నీడనిచ్చే చెట్టునడిగా.. నీకంత ఓర్పు ఎలా వచ్చిందని.. 

అట్టడుగు పొరల్లో దాగి ఉన్న నీటి కోసం చేసే నిరంతర పోరాటం నుండి అంది.. 


యజమానిని చూడగానే ఆనందంతో చిందులేసే కుక్క పిల్లనడిగా .. నీకంత అభిమానం ఎలా వచ్చిందని.. 

తనను ప్రేమగా చూసుకొనే మనిషిపై ఉన్న మమకారం నుండి అంది.. 


కటిక చేదు వేపాకును ఎంతో ఇష్టంగా తింటున్న మేకనడిగా .. నీకు ఆ ఆకులు తినే ధైర్యము ఎలా వచ్చిందని.. 

రోగాలు రాకుండా వేప చేసే మేలు మీదున్న  నమ్మకం నుండి అంది.. 


పగలంతా దుక్కి దున్ని అలిసిపోయిన మహా నందిని అడిగా నీకా శ్రమించే గుణం ఎలా వచ్చిందని.. 

జీవులందరికీ ఆహారం అందించాలనే నాయకత్వం నుండి అంది.. 


అప్పుడు అర్ధమయింది నాకు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అయిదు శక్తుల గురించి.. 


అవే.. ఆరాటం, పోరాటం, మమకారం, నమ్మకం, నాయకత్వం..

ప్రకృతి తో కలసి ప్రకృతి ధర్మాల కోసం శ్రమించటమే స్వర్గ ధామం అని ఎప్పుడు గుర్తిస్తావు

కిక్కిరిసిన నగరంలో ముచ్చెమటలతో మగ్గేవు .. 

మామిడి చెట్టు ఇచ్చే ముచ్చటైన నీడను మరచావు.. 


కోకు టిన్నుల బుస బుసలనే భోగ భాగ్యాలని భ్రమించేవు.. 

ఆవు పాలలో ఉండే అమృత గుణాలను గుర్తెరగకున్నావు.. 


సుమోలు పైకెగిరే మూస సినిమాల మాయలో మురిసిపోయేవు.. 

స్వచ్ఛమైన జానపద సంగీతాన్ని చిన్న చూపు చూసేవు.. 


మొబైల్ ఫోన్ ముందేసుకుని ప్రపంచమంతా చేతిలో ఉన్నట్లు ఊహించుకొనేవు.. 

పచ్చని పొలాలలో ఉండే పక్షుల కిల కిలారావాలను వినలేని జీవితమని తెలియకున్నావు.. 


కష్ట పడకుండా కూర్చోవటమే గొప్ప సుఖం అని నిర్వచనం చెప్పేవు.. 

ప్రకృతి తో కలసి ప్రకృతి ధర్మాల కోసం శ్రమించటమే స్వర్గ ధామం అని ఎప్పుడు గుర్తిస్తావు?????

కదిలి పోతున్న కాలాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు..

కదిలి పోతున్న కాలాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు.. కానీ ఆ కాలంలో కలలను సాకారం చేసుకోగల చావ ఉంది.. 


మనుషులందరికీ మంచి చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు .. కానీ అందరి మంచి కోరే మానవత్వం ఉంటుంది.. 


ఈ ప్రపంచం లో ఉన్న చెడుకి చరమ గీతం ఒక్క మనిషే ఆలపించలేడు.. కానీ తానే ఆ ఉద్యమ స్పూర్తికి స్పందనగా మారగలడు.. 


పది మంది నడిచే బాటను ఒక మనిషి మార్చలేడు ... కానీ మంచి మార్గాన్ని నిర్దేశించే మార్గదర్శి గా మారగలడు.. 


వర్షాలతో ఈ భూమిని సస్యశ్యామలం చేయగల శక్తి ఒక్క మనిషికి అసాధ్యం.. కానీ పడిన నీటిని ఒడిసి పట్టే మేధో సంపత్తి మాత్రం అందరి సొంతము

మన పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అందరూ తెలుసుకొని పాటిస్తే

చేతికొచ్చినట్లుగా చెత్త విసిరేసి మన ఇల్లు శుభ్రంగా ఉందని ఆనందం.. 

అది తిరిగి మనకే అగ్గి పెడుతుందని తెలియని అజ్ఞానం.. 


నాలుకకి రుచిగా అనిపించిన అన్ని పదార్దాలను శుష్టిగా భోంచేయటం.. 

మింగిన తరువాత మన అవయవాల ఆవేదన వినిపించనంత  చెవిటితనం.. 


క్షణ క్షణం మన శరీరాన్ని నశింపచేసే అలవాట్లే అనుభవించటమని నిర్వచనం.. 

లోకాన్ని మన మొండివాదనతో నోరు మూయించామనే అహంకారం.. 


విలువైన కాలాన్ని ఎవరికీ ఉపయోగపడని పనుల్లో వ్యర్థం చేయటం.. 

అనేక సంవత్సరాలు జరిగిన తరువాత మనలో అభివృద్ధి లేదు అని ఆందోళన చెందటం.. 


మన పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అందరూ తెలుసుకొని పాటిస్తే, నాకు ఈ కవిత్వం వ్రాయటమే అనవసరం..

Saturday, January 28, 2017

ఈ ప్రపంచంలో హింసను అంతమొందించడానికి కావాలి మన నాయకత్వం..

నలువైపులా అందాలు.. గల గలా పారే నదులు.. 
ఎత్తైన పర్వతాలు .. ఔషదాలు నిండిన వనాలు 
అమృత ధార ఈ దేశం .. అన్నపూర్ణ మన దేశం.. 
దేవుడు దీవించినది ఈ నేల.. మానవత్వానికి మారుపేరు ఈ భూమి .. 

అభివృద్ధిలో ముందు.. అనురాగంలో ముందు.. 
యువ శక్తి లో ముందు.. సేవాసక్తి లో ముందు.. 
కళలలో ముందు.. కరుణ లో ముందు.. 
ఉపగ్రహాలలో ముందు.. ఉత్సాహం లో ముందు.. . 

సంస్కృతి పుట్టిందిక్కడ.. 
అహింస ఆయుధమైనదిక్కడ.. 
యోగా ఆరోగ్యధామం అయినదిక్కడ.. 
ధనం కన్నా దానం గొప్పదని చాటిందిక్కడ.. 

విశ్వమంతా తన కుటుంబం అంటుంది.. 
సకల జనుల సౌఖ్యం ముఖ్యం అంటుంది.. 
స్త్రీలకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తుంది.. 
అన్ని ప్రాణులు ప్రకృతి కి అవసరమంటుంది.. 

ఈ దేశంలో పుట్టటం మన పూర్వ జన్మ సుకృతం.. 
మన దేశ విలువలను పాటించి కాపాడటం మన కర్తవ్యం .. 
ప్రపంచానికి ఆదర్శం గా మారటం మన లక్ష్యం.. 
ఈ ప్రపంచంలో హింసను అంతమొందించడానికి కావాలి మన నాయకత్వం..

Saturday, January 21, 2017

ఎగిసిపడే సమస్యలను సముద్రమంత దైర్యంతో ఎదుర్కో

ఎగిసిపడే సమస్యలను సముద్రమంత దైర్యంతో ఎదుర్కో.. 

ముంచుకొచ్చే ఆపదలను మేఘమంత ముందుచూపుతో తెలుసుకో.. 

కదిలి వచ్చే కలహాలను కొండంత ప్రేమతో చల్లార్చుకో.. 

పొంచిఉన్న రోగాలను పొద్దుపొడుపంత క్రమశిక్షణతో అరికట్టుకో.. 

తెలియక జరిగే తప్పులను నిప్పులాంటి నిజాయితీతో సరిదిద్దుకో.. 

వృత్తిలో వెనుకబడిన విజ్ఞానాన్ని  వాయువంత ఉరవడితో నేర్చుకో.. 

క్షణ క్షణం క్షీణిస్తున్న నీ ఆయువుని అనుక్షణం ఆకాశమంత ఆనందంతో నింపుకో..

Sunday, January 15, 2017

అందమైన ప్రకృతిని కాపాడటానికి అన్ని విధాలుగా సహకరిద్దాం

నిప్పు లో ఉండే గొప్ప తనాన్ని చెప్పేది భోగి మంట 
భూమాత సారాన్ని పెంచి  పోషించేది గొబ్బెమ్మ 
శుచి శుభ్రత ను మనకు నేర్పేది అందమైన ముగ్గు 
గోసేవ ను గుర్తు చేసేది గంగిరెద్దు ఆట 
పరమాత్మను పరిచయం చేసేది హరిదాసు పాట 
వాయు దేవుని వేగాన్ని కళ్ళకు కట్టేది గాలిపటం 
అన్నదాత అలుపెరుగని శ్రమ ఫలితం పొంగలి 
ప్రకృతి తో    మన విడతీయలేని బంధాన్ని తెలిపేదే సంక్రాంతి.. 

అందుకే .... 

భూసారాన్ని బ్రతికించు కుందాం.. 
వాయువు యొక్క స్వచ్ఛత ని సంరక్షిద్దాం.. 
రైతు కష్టాన్ని గుర్తించి సహాయం చేద్దాం .. 
గోవులను కాపాడుకొని పోషిద్దాం.. 
భాద్యత తో స్వచ్ఛ  భారత్ ను నిర్మిద్దాం.. 

అందమైన ప్రకృతిని కాపాడటానికి అన్ని విధాలుగా సహకరిద్దాం..

కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలిస్తే ప్రతిక్షణం ప్రమోద వినోదమే..

మైసూర్ ప్యాలస్ ని చూసి పాల రాయి తో కట్టిన  మహాద్భుతం అంటారొకరు... 

అదే కోటను చూసిన మరి కొంతమంది తెల్ల రాయి తో కట్టిన పెద్ద ఇల్లు అంటారు.. 

ఆ అద్భుతం కట్టడం లో లేదు .. చూసే మనసులో ఉంది .. 

అనేక రకాల పూవుల తో నిండిన వనాన్ని చూసిన కొంత మంది పరవశం తో పొంగి పోతారు .. 

అదే వనం ప్రక్క నుండి ప్రయాణిస్తున్న వేరొక మనిషికి ఆ చెట్ల వల్ల దోమలు పెరుగుతున్నాయి అని అనిపిస్తుంది.. 

ఆ పరవశం వనంలో నుండి పుట్ట లేదు.. 

వీక్షించే కనుల వెనుక  దాగిన ఆస్వాదించే గుణం   నుండి పుట్టింది.. 

శాస్త్రీయ బద్దమైన వీణా నాదాన్ని విన్న కొందరు ఆనందం తో ఊగి పోతారు.. 

అదే శబ్దాన్ని వింటున్న ఇంకొందరు ఈ ఏడుపు గోల ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూస్తారు.. 

ఆ ఆనందం వీణ లో దాగుందా.. 
లేదు, వినే మనిషి ఊహ నుండి ఉబికింది.. 

పురి విప్పి ఆడుతున్న నెమలిని చూసి పులకితులై పోతుంటారు కొంతమంది.. 

ఈ పక్షి కి తిండి బాగా ఎక్కువ అయింది అంటారు మరికొందరు.. 

ఆ పులకింత నెమలి ఆటలో లేదు.. 
ఆ ఆట లో లీనం కాగలిగిన భావం లో ఉంది.. 

మన చుట్టూ ఎన్ని చిత్రాలున్నా .. 

అర్ధం చేసుకొనే ఆలోచన లేకపోతే అవి ఏవీ మనలను కదిలించలేవు.. 

స్పందించే హృదయముంటే అవని నిండా ఆనందాలే .. 

కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలిస్తే ప్రతిక్షణం ప్రమోద వినోదమే..