ఎందరో మహారాజులు..
అందులో కొందరే మహానుభావులు..
రాజ్యం కోసం యుద్దాలు చేసిన వాళ్ళు యుగాల మాటున కనుమరుగయ్యారు..
ప్రజల కోసం పోరాడిన వారు ప్రపంచ చరిత్రలో చెరగని పుటలలో మిగిలారు..
భారత సరిహద్దు రక్షణకు ప్రాణాలొడ్డిన పృథ్విరాజును మరచేది ఎవ్వరు?
సామాన్యులను సింహాలుగా మార్చిన ఛత్రపతి చిరస్మరణీయునిగా మిగిలాడు..
దీన్ ఏ ఇల్లాహి తో అన్ని మతాలను కలిపి మానవత్వం కోసమే మతం అన్నాడు అక్బర్ చక్రవర్తి..
దక్షిణ భారత హద్దులను హంపీ తో అనుసంధానం చేసిన కృషీవలుడు కృష్ణ దేవరాయలు ..
సిపాయిల తిరుగుబాటును స్వతంత్ర పోరాటంగా మార్చిన వీర నారి ఝాన్సీ రాణి..
ఆబాల గోపాలానికి అహింసను అలవాటుగా మార్చిన మహా మనిషి అశోక చక్రవర్తి..
ప్రజా రక్షణ కోసం కఠిన నియమాలు పాటించిన కాకతీయ కాంతి పుంజం రుద్రమదేవి..
రాజ్యాలు ఏలటం కాదు గొప్ప..
రాబోయే తరాలు గుర్తుంచుకునేలా పాలించటం..
కత్తులతో కుత్తుకలు కోయటం కాదు వీరత్వం..
కరుడు కట్టిన క్రూరత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం..
జనం కోసమే జీవించటం..
ప్రేమ నిండిన ప్రపంచాన్ని నిర్మించటం..
అదే రాచరికం..
అదే నిజమైన క్షత్రియ ధర్మం..