Saturday, December 17, 2016

ఓ దైవమా నీ లీలలు అనంతం..

ఓ దైవమా నీ లీలలు  అనంతం..

 ప్రతి జీవిని నీవే సృష్టిస్తావు.. వాటి సంఖ్యను మరొక జీవి తో నీవే నియంత్రిస్తావు.

కొండ నువ్వే ఇచ్చావు  .. ఆ కొండ క్రింద నీటిని నీవే దాచావు.. 

కష్టాలు నీవే ఇస్తావు .. వాటిని కాచుకొనే దైర్యం నీవే ఇస్తావు

కోరికలు నీవే ఇచ్చావు ..  దురలవాట్ల నుండి బయటపడే ఆత్మ నిగ్రహాన్ని నీవే ఇచ్చావు.. 

చెట్టు నుండి ఇత్తు తయారు చేస్తావు.. అదే ఇత్తునుండి చెట్టు మొలిపిస్తావు.. 

ప్రకృతి నియమాలు పాటించని వారిని  శిక్షిస్తావు.. నమ్మి నీ దారికొస్తే నయం చేసుకోవటానికి మొక్కల్లో మందులు నీవే నింపావు.. 

ఎక్కుడున్నావో తెలియక తర తరాలుగా  వెతుకుతున్నారు అందరు.. 

అనుక్షణం ఈ ప్రకృతి లో నీవే ప్రత్యక్షంగా ఉండి నడిపిస్తున్నావని గుర్తించిన వారెందరు?

.

కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలిస్తే ప్రతిక్షణం ప్రమోద వినోదమే

మైసూర్ ప్యాలస్ ని చూసి పాల రాయి తో కట్టిన  మహాద్భుతం అంటారొకరు... 

అదే కోటను చూసిన మరి కొంతమంది తెల్ల రాయి తో కట్టిన పెద్ద ఇల్లు అంటారు.. 

ఆ అద్భుతం కట్టడం లో లేదు .. చూసే మనసులో ఉంది .. 

అనేక రకాల పూవుల తో నిండిన వనాన్ని చూసిన కొంత మంది పరవశం తో పొంగి పోతారు .. 

అదే వనం ప్రక్క నుండి ప్రయాణిస్తున్న వేరొక మనిషికి ఆ చెట్ల వల్ల దోమలు పెరుగుతున్నాయి అని అనిపిస్తుంది.. 

ఆ పరవశం వనంలో నుండి పుట్ట లేదు.. 

వీక్షించే కనుల వెనుక  దాగిన ఆస్వాదించే గుణం   నుండి పుట్టింది.. 

శాస్త్రీయ బద్దమైన వీణా నాదాన్ని విన్న కొందరు ఆనందం తో ఊగి పోతారు.. 

అదే శబ్దాన్ని వింటున్న ఇంకొందరు ఈ ఏడుపు గోల ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూస్తారు.. 

ఆ ఆనందం వీణ లో దాగుందా.. 
లేదు, వినే మనిషి ఊహ నుండి ఉబికింది.. 

పురి విప్పి ఆడుతున్న నెమలిని చూసి పులకితులై పోతుంటారు కొంతమంది.. 

ఈ పక్షి కి తిండి బాగా ఎక్కువ అయింది అంటారు మరికొందరు.. 

ఆ పులకింత నెమలి ఆటలో లేదు.. 
ఆ ఆట లో లీనం కాగలిగిన భావం లో ఉంది.. 

మన చుట్టూ ఎన్ని చిత్రాలున్నా .. 

అర్ధం చేసుకొనే ఆలోచన లేకపోతే అవి ఏవీ మనలను కదిలించలేవు.. 

స్పందించే హృదయముంటే అవని నిండా ఆనందాలే .. 

కాలాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలిస్తే ప్రతిక్షణం ప్రమోద వినోదమే..

Sunday, November 6, 2016

కానీ వారిని సృష్టించిన స్రుష్టి కర్తకు ఇదే నా మనవి.. వారి మానసిక వ్యాధిని త్వరగా నయం చేయాలని

పది మంది తిరిగే పార్కులలో పగల కొట్టిన మందు సీసాలు 
మూర్ఖ శిఖామణులు మన మధ్య ఉన్నారని చూపే చేదు నిజాలు 

మత్తెక్కితే మదం హెచ్చుతుందా లేక మనలను ఎవరు అడుగుతారు అనే అహంకారామా.. 

ఎన్ని రకాల అనర్థాలు ఆ పగిలిన గాజు పెంకులతో 

తెలియక కాలు వేసి రక్తం చిందే మూగ జీవులు 

భూమిలో కలవని ఆ గాజు ముక్కలు మట్టిలో దాగివుండే కత్తులు.. 

చెట్లను పెంచే తోట మాలికి తెఛ్చి పెడతాయి అనుక్షణం ఆపదలు..

ఇన్ని అనర్థాలకు మూలము ఆ మందుబాబుల మనసులేని అకృత్యం.. 

భూమి నాశనం..  పరిసరాలు అపరిశుబ్రం 
మొక్కలు పెంచలేము.. చెల్లా చెదురయిన ముక్కలను వేరలేము.. 

అర్ధం పర్థం లేని ఆనందానికి ప్రకృతి మాతకు చెరగని గాయం.. 

ఎవరో తెలియదు.. ఎలా వారిలో మార్పు తేవాలో తెలియటం లేదు.. 

కానీ వారిని సృష్టించిన స్రుష్టి కర్తకు ఇదే నా మనవి.. 

వారి మానసిక వ్యాధిని త్వరగా నయం చేయాలని









Sunday, October 30, 2016

ఇకనైనా ప్రకృతి వ్యవసాయాన్ని అర్ధం చేసుకొందాం.. విధాత నిర్దేశించిన విధానంలో అమృత ఆహారాన్ని పండిద్దాం

ఎవరు వేసారు ఆ విత్తనాలు 
ఎవరు నాటారు ఆ మొక్కలు 
ఎవరు వేస్తున్నారు ఎరువులు 
ఎవరు చల్లుతున్నారు పురుగు మందులు 

దట్టమైన అడవి .. పురుగులు కొరకని ఆకులు 
అనేక రకాల మొక్కలు.. తెగుళ్లు కానరాని పచ్చదనాలు
ఆకాశాన్ని అంటే ఎదుగుదల.. కన్నుల పండగగా పూలు 
ఎటు చూసినా తరగని అందాలు.. ఎంత చూసినా తనివితీరని  ప్రకృతి ప్రమోదాలు 

ఎన్నో పుస్తకాలు చదివాము .. కనులముందున్న ఈ అద్భుతాలను గమనిస్తున్నామా?
పట్ట బద్రులమే కానీ .. ప్రకృతి నేర్పే సహజ వ్యవసాయాన్ని అర్ధం చేసుకొంటున్నామా?
పరిశోధనలు చేసి మరీ పురుగు మందులు తయారు చేస్తాము.. కానీ 
కాణీ ఖర్చు లేకుండా పురుగుల్ని తరిమే వేప నూనె, గోమూత్రాన్ని విలువించం

టన్నుల కొద్ది ఆహారాన్ని పండిద్దామని చూస్తాం..  
విషతుల్యమైన ఆహారాన్ని ఏమి చేసుకొందాం?

ఇకనైనా ప్రకృతి వ్యవసాయాన్ని అర్ధం చేసుకొందాం.. 
విధాత నిర్దేశించిన విధానంలో అమృత ఆహారాన్ని పండిద్దాం

పండుగ కావాలి కానీ ఆ పేరుతో పర్యావరణాన్ని పాడు చెయ్యద్దు

ఎక్కడి నుండి వచ్చింది ఈ టపాసులు పేల్చే సంస్కృతి 

దీపావళి అంటే దీపాల ద్వారా లక్ష్మి దేవికి స్వాగతాంజలి 

ఈ శబ్దాల తాకిడికి ఆమెకే చిరాకు పుట్టే పరిస్థితి 

చెవులకు చిల్లులు, దారులన్నీ కాగితాలమయం, పీల్చే గాలిలో రసాయనాల విలీనం, విలువైన 
ధనం అగ్గిలోన ఆవాహనం

ఎవరు పుట్టించారో తెలియదు, ఏ పురాణం లో వ్రాసుందో తెలియదు. 
పక్కింటి వాడు పది వేల సామాను కాల్చాడు నేను ఇరవై వేలు కాల్చాలి అనే పంతం 
సందులో సందని చైనా నుండి టన్నులకొద్దీ టపాసుల ప్రవాహం 
వృధాగా జాతీయ ధనం బూడిద మయం 

ఇంకొక ప్రక్క బాల కార్మికులతో టపాసుల తయారి 
అగ్ని ప్రమాదాల్లో అమాయక బాలల  బలి 

అవసరమా మనకి  ఈ అర్ధం లేని ఆనందం 
ఎంతకాలం ఆడదాం  ఆ అగ్ని తో  చెలగాటం 

మరొక ప్రక్క మన పైశాచిక శబ్ద కాలుష్యానికి బెదిరిపోయే మూగ ప్రాణులు 
వాతావరణ సమతుల్యానికి క్షణ క్షణం తూట్లు 

కూర్చున్న చెట్టు  కొమ్మనే నరుక్కొనే అవివేకులు
గుంపులో గోవిందలు కొట్టే గొర్రెల మందలు 

మతం  కావాలి కానీ మూఢ నమ్మకాలు వద్దు 
పండుగ కావాలి  కానీ    ఆ పేరుతో పర్యావరణాన్ని పాడు చెయ్యద్దు