Monday, December 5, 2022

అమూల్యమైన వరం..నీ జీవితం..సార్ధకం చేసుకో..

కదులు కదులు కదులు ముందుకు..
అడ్డు గోడల నడ్డి విరిచి కదులు ముందుకు..
క్షణ క్షణం అను క్షణం నీ కదలిక వరం నీకు..
అంతం చేసు కొనే హక్కు అసలు లేదు నీకు..

సమయం తీరే వరకు పోరాడు సమస్యలతో..
మెదడుకు పదును పెట్టి చూడు తెలివితో..
కొత్త దారులు కోసం వెతికి చూడు నమ్మకంతో
ప్రాణం ప్రకృతి ప్రసాదం  సంపూర్ణం చేసుకో..

కమ్మిన మబ్బు వెనుక సూర్యోదయం చూడు
పగిలినఅద్దంలో వేలల్లో నీ ప్రతిబింబం చూడు
కొండలు గుట్టల దారి అవల నీ గమ్యం చూడు
ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్నది అందుకో

ఒంటరివి కావు నీవు.. ఊహ కందని ఉప్పెనవు
బలహీనుడివి కాదు నీవు..భగ భగ మండే ఆగ్నివి
నిరాశకు సొత్తువు కాదు నీవు.. ఆశా కిరణానివి
పిరికిపందవు కావు నీవు..గెలిచే వీర సైనికుడివి 

తల విదిలించి చూడు..అవిగో  వేల అవకాశాలు 
కళ్ళు తెరచి చూడు.. నలు దిక్కులా రహదారులు
చిత్తశుద్ధితో ప్రయత్నించు..నాయకునిలా జీవించు..
అమూల్యమైన వరం..నీ జీవితం..సార్ధకం చేసుకో..


       - ప్రభాకర రావు కోటపాటి

          6 - డిసెంబర్ - 2022









Saturday, August 13, 2022

అడుగులో అడుగు వేసుకుంటూ.. అందుకోమంది నన్ను ఆకాశం..

అడుగులో అడుగు వేసుకుంటూ..
అందుకోమంది నన్ను ఆకాశం..

తనువంతా తపన నింపుకొని..
సరికొత్త ఎత్తులను చేరుకోమంది నా చైతన్యం.
క్షణ క్షణం కరిగి పోకుండా వడిసి పట్టుకొని.. 
ఆనంద ఝరిలో  తడవమంది నా హృదయం

నడిచి నడిచి పాత బడ్డ దారులు వదిలి..
తల విదిలించి కదిలి సాగమంది నా అవేశం
మూఢనమ్మకాలతో ముడి వేసుకోవటం మాని
మార్పు కోసం పిడికిలి బిగించమంది నా రక్తం

ముందున్న సమస్యలకు లొంగి పోకుండా..
గెలుపు కోసం పోరాడమంది నా వీరత్వం.
ఒడిదుడుకులను ఓటమిగా భావించకుండా..
నిరంతర యుద్ధం చేయమన్నది నా పటుత్వం

అది కాదు ఇది కాదు నా వల్లకాదు మాని..
ఎందుకు కాదు అని కదలమన్నది నా గమనం
అదృష్టం కోసం నలు దిక్కుల చూపులు మాని
నూతన శకానికి నాంది కమ్మంది నా జీవితం..


          -- ప్రభాకర రావు కోటపాటి
                  13 ఆగస్టు 2022








Saturday, June 25, 2022

అమృతాన్ని అందించే జలధార కాపాడుదాం

చిరుజల్లుకు చిందేను చిరునవ్వులు
విరిజల్లుకు వళ్ళంతా వీణానాధాలు 
జడివానకు నదులన్నీ పొంగిపారేను
జోరువానకు జగమంతా జలధారలు

తొలకరి కోసం ఎదురుచూసే రైతు సంబరాలు
ఎండిపోయిన వాగు వంకలకు కొత్త కళలు
నిండిన చెఱువుల నుండి కప్పల బెక బెకలు
రాలిన చెట్లకు సరి కొత్త పచ్చని లేత ఆకులు

మనుషులుచేసిన మలినాలను కడిగేను వాన
సిరి మల్లెలు నింగి నుండి విసిరేను చినుకులు
సెలయేటి గలగలల కు ఇందనం ఈ వర్షాలు
మేఘాలపై స్వారీచేస్తూ సాగేను నీటిబారులు

చిటపట చినుకులు అంతులేని అద్బుతం
నీరు లేని జీవితాలు ఊహకందని ఉత్పాతం 
మానవ తప్పిదాలకు భూమి నీరు లేని ఎడారి
వరుణుని జాడ లేక దిక్కులు అగ్నిగుండాలు

ప్రకృతిని పాడుచేసే ప్రతిపని బహిష్కరిద్ధామ్ 
అమృతాన్ని అందించే జలధార కాపాడుదాం 


      - ప్రభాకర రావు కోటపాటి
              25 జూన్ 2022


Saturday, May 7, 2022

మంచిని ప్రేమించి ప్రోత్సహించి పెంపొందించు..చెడును చండ శాసనంతో వేళ్ళతో పెకలించు..

అసంతృప్తి అశాంతి అభద్రత ఆందోళన
అవసరమా మనకు ఆ అనవసర భారం..
పరుగులు పొట్లాటలు పగలు ప్రతీకారాలు
చివరకు నష్టం మనకే అని గుర్తించలేదా..
కావాలి ఇంకా కావాలి అంతా నాకే కావాలి
కాలక్రమంలో అన్నీ వదిలి పోవాలని తెలుసా..
దొడ్డి దారులు దొంగ తనాలు బలాత్కారాలు
చేరుకొనేది ఇక్కట్లు కొట్లాటలు కట కటాలు..

నువ్వేమి ఇస్తావో తిరిగి  అదే పొందుతావు
నువ్వేమి ఆలోచిస్తావో అదే అవుతుంది..
ధర్మం నీతి నిబద్దత నిజాయితి సత్యం 
మనలను కాపాడే సహజ వజ్ర కవచాలు..
ప్రేమ ఆప్యాయత సర్వ జీవుల హితం 
నాయకునిగా నీ శిరస్సు మీద కిరీటాలు..
ఆనందం ఆత్మసంతృప్తి  అభిమానం
నీకు అందే వెల కట్టలేని సిరి సంపదలు..

అధికారదాహం దురహంకారం దురాక్రమణ
మూర్ఖ మానవులు చేసే విశృంఖల విహారం..
వ్యతిరేకత తిరుగుబాటు విప్లవం రక్తపాతం
వారికి చరిత్రలో మిగిలే గుర్తింపు పత్రాలు..
విద్వంసం విచిత్ర ధోరణి వికృత చేష్టలు 
తామే శాశ్వతం అనుకొని బ్రతికే బ్రమ జీవులు
నేనుచెప్పిందే జరగాలి నాకునచ్చింది చేయాలి
ఆ  విపరీత బుద్దే అన్ని సమస్యలకూ మూలం

ఈ విశాల ప్రకృతిలో మనమొక పరమాణువు
చేతనైన మంచిచేయటమే మనుగడ మూలం
పది మంది మేలు కోరటమే జీవన మంత్రం
తోటిజీవుల స్వతంత్రతను హరించటం పాపం
నీవునడిచేబాట అనేకమందికి ఆదర్శంకావాలి
కులం మతం జాతి మనలను విడదీయరాదు
మంచిని ప్రేమించి ప్రోత్సహించి పెంపొందించు
చెడును చండ శాసనంతో వేళ్ళతో పెకలించు


             ప్రభాకర రావు కోటపాటి
                     7 మే 2022











Friday, April 8, 2022

సాగిపో.. సాగిపో..అనుకున్నది అందుకో..

సాగిపో.. సాగిపో..అనుకున్నది అందుకో..
అడుగులో అడుగు వేసుకుంటూ అందుకో

అడ్డు గోడల పునాదులు పెకలిస్తూ కదిలిపో
భగభగలాడే అగ్నిలా ఆత్మస్థైర్యంతో రగిలిపో  
క్షణ క్షణం కణ కణం లక్ష్యం వైపు మార్చుకో
ఎంతఎత్తయినా రావాలి కదిలేవాని కాళ్లక్రిందే

చేసిందే చేస్తూ పోతే అనుకున్నది చేర లేవు 
నీ మీద నీకు అనుమానమే ఆగర్భ శత్రువు
విలాసాలలో మునిగితే లక్ష్యాలను గెలవలేవు
కలిసి వచ్చే కాలం ఎదురు చూపులతో రాదు

ఓర్పు నేర్పు కూర్పుతో చరిత్ర సృష్టించ గలవు
మనసుతో ముందడుగువేస్తే సాధన సులువు
సరి కొత్త ఆలోచనలే నూతన శకానికి నాంది
నిజాయితి నమ్మకం కృషి విశ్లేషణ ఇంధనాలు

కారణాలు చెప్పటం ఆపి కార్యదీక్ష బద్దుడవు
ఆత్మ న్యూనత వదిలి అహర్నిశలు శ్రమించు
సంశయాలుమాని లక్ష్యాన్ని ఉడుములా పట్టు
నిరాసక్తత నేలరాచి విశ్వ నాయకునిగా మారు

సాగిపో.. సాగిపో..అనుకున్నది అందుకో..
అడుగులో అడుగు వేసుకుంటూ అందుకో


     - ప్రభాకర రావు కోటపాటి
            9 ఏప్రిల్ 2022

Friday, March 4, 2022

పరమాత్మ అనుసంధానమే ఆత్మసాక్షాత్కారం

వికసించిన పుష్పాలను చూసి  విప్పారతాయా నీ కనులు?
ఉదయించే ఉదయభానుని వీక్షించి 
ఉరకలేస్తుందా నీ ఉత్సాహం?
మట్టిని చీల్చుకొని పైకిలేచే మొలకను చూసి
ఉప్పొంగుతుందా నీ హృదయం?
పసి పిల్లల చిల్లర ఆటలు గమనించి
చిరునవ్వు చిందుతుందా నీ మోములో?

అసలైన ఆనందాన్ని గుర్తించారని అర్దం..

ఆనందానికి అవసరం .. ఆత్మ సంతృప్తి
మనశ్శాంతికి అవసరం.. స్పందించే గుణం
పరిపూర్ణతకు అవసరం..నిజాన్ని గుర్తించే శక్తి
జీవితానికి అవసరం.ప్రకృతితో సహప్రయాణం

విచ్చలవిడితనంతో వచ్చేది వికృత వికారం
విశృంఖల అలవాట్లు చేర్చేది అథఃపాతాళం
అధర్మ అనువర్తన నడిపించేది నరకప్రయాణం
అసత్య భాషతో అందేది అవమానాల కిరీటం

సృష్టి నియమాల పాలన యే పరమ సోపానం
సకల జీవులతో అనుబంధమే ఆనందగమనం
అజాత శతృవుగా జీవితమే దివ్య అలంకారం
పరమాత్మ అనుసంధానమే ఆత్మసాక్షాత్కారం


        - ప్రభాకర రావు కోటపాటి
                  05 మార్చి 2022