Sunday, September 27, 2020

ఇన్ని గొప్పతనాల సమ్మిళితమే..శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జీవితం..

ఎన్ని స్వరాలు, ఎన్ని రసాలు, ఎన్ని భావాలు 
అన్నిటికీ చెరగనిచిరునామా మన బాలుగారు
సినీసంగీతానికి తరగనిసంపద అయన గానం
అనేక చిత్రాల విజయానికి ఆధారం ఆ గాత్రం 
తెలుగు భాష కు అయన స్వరమే ఒక వరం 

విదాత తలపున అంటూ ఆలపించినా
సంభవం నీకే సంభవం అంటూ గర్జించినా
పుణ్య భూమి నాదేశం అంటూ మేల్కొలిపినా
శంకరా నాద శరీరా పరా అని ప్రార్దించినా
సంగీత ప్రియులకు అదొక స్వర్గ విహారం 

దశాబ్దాలుగా ఆ గళం నుండి ఆణిముత్యాలు
అలసిసొలసిన మనుషులకు వీనులవిందులు
కొండలలో నెలకొన్న దేవునికి మేలుకొలుపులు
ఎన్నెనో జన్మలకు తరిగిపోని ప్రేమ సంపదలు
తన దరికిరాని వనాలకోసం ఎన్నో వసంతాలు
తర తరాలను తరింప చేసే గందర్వ గానం

కృషిఉంటేమనుషులుఋషులౌతారనిసాక్ష్యం
పాడుతాతీయగాతో భావిగాయకులకుజననం
గేయ రచయితలకు  సముచిత సత్కారం 
సంగీతదర్శకుల తెరవెనుకశ్రమకుప్రోత్సాహం
తీయనైనతెలుగుకుతేనెలు అద్దినఅభిమానం 

ఇన్ని గొప్పతనాల సమ్మిళితమే..శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జీవితం..

గగన శిఖలకు ఎగిసిపోయినా.. అయన అందించిన స్వరసంపద మన గుండెలలో పదిలం..

అయన అడుగు జాడలలో నడిచి..
పది కాలాలు గుర్తుంచుకొనే సేవలు అందించటమే..మనందరి కర్తవ్యం..


      - ప్రభాకర రావు కోటపాటి 
          27 - సెప్టెంబర్ - 2020
 

Sunday, September 13, 2020

చెడులను చాకచక్యంగా గెలవటమే బ్రతకడం

మెరిసేది అంతా బంగారం కాదు 
తెల్లగా ఉన్నవి అన్నీ పాలు కాదు 
అబద్దాలకుండే  అందము నిజానికి ఉండదు
తెలుసుకొనే శక్తి లేకపోతే మోసపోక తప్పదు 

రంగు కళ్లజోడు దరిస్తే ఆకాశం రంగు మారదు 
చెత్తలో నిప్పు దాచిపెడితే మండక మానదు 
వెర్రి మొర్రి అభిమానాలతో ఒరిగేదేమీ లేదు 
నిజ నాయకుల సాహవాసానికి తిరుగులేదు 

పంతాలుపట్టింపుల కంటే ఫలితాలు ముఖ్యం
ఎదుటివారిలో మార్పుకోసం మమతేమూలం
లోకం మనలా ఆలోచించాలి అనేదే అవివేకం
కూర్పుచేర్పు నేర్పు ఓర్పులతో ఏదైనాసాద్యం 

అహంకారమే అన్నింటికీ మించిన అనారోగ్యం
పెద్దతోపుఅయినా తనకుమించినది న్యాయం
దురహంకారం దుర్మార్గం దర్మ కాలాఙికి దగ్దం
పైశాచికఆనందఅభిలాషికి తుదకుశిక్షఖాయం 
 
జీవితమంటే అర్దంచేసుకోవటం అర్దంకావటం
ప్రతిమనిషిలో మంచిచెడు ఉండటం సహజం
చెడులను చాకచక్యంగా గెలవటమే బ్రతకడం 
అందరినీకలుపుకుని నడవటమే నాయకత్వం


       - ప్రభాకర రావు కోటపాటి
          13 -  సెప్టెంబర్ - 2020

 

Sunday, August 23, 2020

నిస్సందేహంగా వదులు..ఆ మందుల మారణహోమం

అణువు నుండి ఆరడుగులు ఎదిగే మనిషి 
అంతరాళాలలో అనంత శక్తి దాగిన యోగి 
పుట్టుకతోనే సొంతం రక్షించే రోగనిరోధకశక్తి 
ప్రకృతినియమ పాలనే దానిని పెంచే యుక్తి 

ఆడుగు అడుగుకూ తప్పిదాలు చేస్తూ 
గుప్పెడు గుప్పెడు మందులు సేవిస్తూ 
క్షణ క్షణం ఆరోగ్యాన్ని కొనుక్కుంటూ 
తపన తపనతో చేసేదంతా చివరకు తదాస్తు

అసహజ ఆహారం .. అసహజ జీవన శైలి
ఎలాగైనా అనందం..దురలవాట్ల సహవాసం
మూలికలంటే సందేహం..
రసాయానలపై విశ్వాసం
నిజం అంటే నిష్టూరం..ఆసుపత్రికి  ప్రయాణం

దేవదేవుడు కొలువైన దేవాలయం ఈ దేహం 
అనంత శక్తి సంపదల నిలయం ఈ దేహం
శ్రద్దభక్తులతో యోగసిద్దితో చైతన్యం ఈదేహం
నిస్సందేహంగా వదులు..
ఆ మందుల మారణహోమం


                  ప్రభాకర రావు కోటపాటి
                      24-ఆగస్టు-2020

Sunday, August 16, 2020

జీవితయుద్దములో.కర్తవ్యబద్దుడవై కొనసాగు

దేహం కాదు నీవు.. ధనస్సువే నీవు
ఒంటరివి కాదు నీవు.. ఉద్యమమే నీవు
తల విదిలించావా.. విధి తలవంచక తప్పదు
పిడికిలి భిగించావా.అడ్డుగోడలకు ఆఖరిరోజు 
అందుకే కదులు నీవు.. కదంతొక్కు నీవు
ఆశయాల సాధన కోసం.. అంకితమై సాగు

నలిగిన దారులు వదిలి.నవోదయమై కదులు
ఉత్తమాటలు మాని.క్రొత్తదారిలోకృషిసాగించు
పధకంతో పని చేస్తే..శత సహస్ర ఫలితాలు 
ఎదురు దెబ్బలను..గురువులని గౌరవించు 
ఆపకు నీ ప్రయాణం..వదలకు నీ ప్రమాణం 
కొనసాగిస్తూ ఉండు.కదం తొక్కుతూనేఉండు

ఇది సమస్యల ప్రపంచం..పరిష్కారమేమార్గం
అలుపెరుగని ప్రయత్నమే..విజయ సోపానం
తెలివొకరి సొత్తు కాదు..ఆలోచనలే విత్తనాలు
మనిషి మెదడు అద్భుతం..వాడితే ఆయుధం
నిరంతర పరిశోధనే..వినూత్న విధి విదానం
జీవితయుద్దములో.కర్తవ్యబద్దుడవై కొనసాగు


                 - ప్రభాకరరావు కోటపాటి
                       16-ఆగస్ట్-2020


Friday, July 31, 2020

అందుకే ప్రతిక్షణం ఆనందమయం జీవితం..

ఉదయభానుని నులివెచ్చటి కిరణం 
చిట్టి చిట్టి పక్షుల కిల కిల రావం 
సుస్వరాల విందైన శాస్త్రీయ సంగీతం
శారీరక శక్తిని పెంపొందించే యోగ సాధనం 
సకల పోషకాలు నిండిన అమృత ఆహారం
ఆహా ఎంత అందమైనది ప్రతి ఉదయం 

క్షణ క్షణం సరికొత్త ఆవిష్కరణల లోకం
ఎంత నేర్చుకున్నా తరగని విఙ్ఞానం
చిత్తసుద్దితో శోదిస్తే అవకాశాల సమాహారం 
ఏకాగ్రతతో ప్రయత్నిస్తే ప్రతిఅడుగు విజయం
ఎదురుదెబ్బలను ఎదుగుదలగా మార్చేనైజం 
మన సంకల్పానికి ఉంది అంతులేని బలం 

రంగు రంగుల పుష్పాలు వెదజల్లే సుగందం
జల జల పారే జీవ నదుల నిత్య పయనం
రెక్కలతో స్వేచ్చగా విహరించే  పక్షిసమూహం
అనేక రూపాలతో అబ్బురపరిచే జంతుజాలం
పచ్చటిరంగును భూమికిదిద్దే వృక్షసందోహం
ఎంతచూసినా చూడాలనిపించే పకృతిఅందం

మనక్షేమాన్ని కోరే అమ్మా నాన్నల ఆశీర్వాదం 
మనకు నడక నేర్పిన గురువుల ప్రోత్సాహం 
వెన్నంటి ఉండే మంచి మిత్రుల అభిమానం
మనకు రక్షణ కల్పించే రాజ్యాంగ యంత్రాంగం మన మనుగడకు సకల జనుల సమాజం 
వారి త్యాగ ఫలితమే మన కదలికకు ఆదారం

మనిషికి ప్రత్యేక శక్తి యుక్తులు ఇచ్చిన దైవం 
తనప్రతినిధిగా ప్రకృతిని కపాడమని సందేశం
అనంతమైన విశ్వానికి నాయకత్వ అవకాశం
నియమాలను పాటించే వానికే ఆ అధికారం 
లోకకల్యాణం కోసం పనిచేయటమే కర్తవ్యం 
అందుకే ప్రతిక్షణం ఆనందమయం జీవితం..


            -ప్రభాకర రావు కోటపాటి
               1 - అగస్టు - 2020


 


Sunday, July 26, 2020

అనంతమూర్తి నియమాలను పాటించి..జగజ్జేయుడవై జీవించు.

అస్తమించిన సూర్యుడు.. 
ఉదయించక మానడు
కొమ్మ విరిగిన చెట్టు..
మరొక వైపు పెరగక మానదు 
రచ్చ చేస్తున్న రోగాలు.. 
అంతరించి పోక తప్పదు 
సృష్టిని నడిపే అచంచల శక్తికి.. 
అతీతమైన అధికారం లేదు

నమ్మకంతో నడిచావా.. 
అనుకున్నది సాధిస్తావు 
సవ్యదృష్టితో గమనించావా.. సుడిగుండములో దారి వెతుకుతావు
మనస్పూర్తితో మొదలుపెట్టావా..
ఎవరెష్టు కూడా ఎక్కుతావు 
విధాతను విలువించావా.. 
విశ్వవిజేతగా మారతావు 

గడచిపోయినది గతం..
ముందున్నది అవకాశాల మణిహారం 
అడ్డుగోడలన్నీ అశాశ్వతం ..
తొలగించేది అలుపెరుగని ప్రయత్నం 
కష్టసుఖాలమయం జీవితం..
సమదృష్టితో ఎల్లవేళలా సంతోషం 
దేవదేవుని లీలలు అనంతం..
దర్మదీక్షతో లక్ష్యసాధన సుసాద్యం

ఒకదారి మూసుకుపోతే..
మరొకదారి కోసం గాలించు 
పరిస్తితుల నింద వదిలి..
పరిష్కారాల పరిశోదన కొనసాగించు 
అనుభవాల సారాన్ని రంగరించి..
సరికొత్త సామ్రాజ్యాన్ని స్తాపించు 
అనంతమూర్తి నియమాలను పాటించి..
జగజ్జేయుడవై జీవించు.
  
      -ప్రభాకర రావు కోటపాటి 
       26 జులై 2020

Sunday, July 19, 2020

ప్రణామం ప్రణామం నీకే ఓ ప్రకృతి మాత

నీ సన్నిధిలో ఏదో అనందం
అది మాటలలో తెలుపలేని అనుభవం
అలవాటు మారిపోయింది ఈ అనుబంధం 
నిన్ను చూస్తేనే అవుతుంది నా సాయంత్రం 

ప్రణామం ప్రణామం  నీకే ఓ ప్రకృతి మాత 
కావాలి కావాలి అనుక్షణం నీ మమత
వదలలేను వదలలేను నీ చేయూత 

నీ దయలేక పోతే జీవితమే జబ్బులమయం
నీ నియమాలకు దూరమే దారి తప్పటం
నీ ప్రకోపమే విష జ్వరాల విన్యాసం 
నీ సమతుల్యతే మనుగడకు మూలాధారం

ప్రణామం ప్రణామం  నీకే ఓ ప్రకృతి మాత 
కావాలి కావాలి అనుక్షణం నీ మమత
వదలలేను వదలలేను నీ చేయూత 

అన్ని బాధలను తొలగించే తల్లివి నీవు
జన జీవనాన్ని నడిపించే జాగృతివి నీవు
వ్యర్దాలను ఎరువులుగా మార్చే వ్యవస్థ నీవు
అలసిపోయిన మనసులకు స్వాంతన నీవు

ప్రణామం ప్రణామం  నీకే ఓ ప్రకృతి మాత 
కావాలి కావాలి అనుక్షణం నీ మమత
వదలలేను వదలలేను నీ చేయూత 

మారింది జీవితం నిన్ను కనుగొన్న తరువాత  
పదే పదే పాడుతుంది గుండె నీ పాట 
మారావు నీవే నా ద్యాసగా శ్వాసగా
అంకితం అంకితం నీకే నీకే నా సర్వస్వం 

ప్రణామం ప్రణామం  నీకే ఓ ప్రకృతి మాత 
కావాలి కావాలి అనుక్షణం నీ మమత
వదలలేను వదలలేను నీ చేయూత