ప్రభాకర శతకం (Prabhakara Sathakam) - భాగం 2 (పద్యాలు 11-20)
సృష్టిలోని వైరుధ్యాలను, మానవ స్వార్థాన్ని ప్రశ్నిస్తూ సాగే సామాజిక-తాత్విక కవితా సంకలనం
11. ధూమపాన వ్యసనం
సిగరెట్ పెట్టెపై మృత్యు హెచ్చరికలున్నా
నాకేమి కాదనే అహంభావముతో పొగ పీలుస్తూ
సున్నితమైన ఊపిరితిత్తులను బుగ్గిపాలు చేసుకొనేవు
ధృఢ సంకల్పముతో వ్యసనాన్ని వీడి ప్రాణాలను కాపాడుకో
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
12. మద్యపాన భ్రమ
మద్యాన్ని వేడుకల చిహ్నముగా భావిస్తూ
అడుగడుగునా స్లో పాయిజన్‌ను కొని తాగుతూ
అంతరంగ అవయవాలన్నీ కుళ్ళి కృశించేది గుర్తించలేవు
మృత్యుశయ్యకు ముందే మత్తును వీడి బ్రతుకును దిద్దుకో
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
13. వ్యవసాయ నిర్లక్ష్యం
లాభసాటి గాని వ్యవసాయ భారముతో నలిగిపోతూ
కూలి బ్రతుకులై యువత పట్టణాల వలస బాట పట్టగా
కన్న ఊరు వృద్ధాశ్రమమై విలవిలలాడుతున్ననాడు
పండించే విజ్ఞానంతో అమ్ముకునే ఆసరాతో అండగా నిలబడు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
14. గుడ్డి అనుకరణ
ఎవరో చెప్పినవన్నీ గ్రుడ్డిగా నమ్ముతూ
సొంత వివేచనను వదలి యాంత్రికముగా బ్రతుకుతూ
ప్రశ్నించే తత్వాన్ని మరిచి సమాజాన కీలుబొమ్మగా మిగులుతావా
సత్యాసత్యాల గ్రహించి నీ సొంత ఆలోచనకు పదను పెట్టు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
15. అసత్య జీవనం - ముసుగులు
నిజం చెప్పే ధైర్యం లేక అబద్ధాల ముసుగేసి
ఆత్మగౌరవాన్ని అమ్ముకొని మానసిక క్షోభ పడుతూ
పరిస్థితులకనుగుణముగా రంగులు మార్చే ఊసరవెల్లిగా మారతావా
ముసుగులను తొలగించి ధైర్యముగా సత్యపక్షాన నిలబడు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
16. ఆత్మవిశ్వాస లోపం
అద్భుతమైన దేహాన్ని, శక్తిని ఇచ్చిన భగవంతుని మరిచి
కష్టాలు రాగానే అధైర్యపడి చేతులు వదిలేస్తూ
సమస్యల వెనుక దాగిన పరిష్కారాలను వెతకడం ఆపేస్తునావు
పరిస్థితులకు లొంగక నిన్ను నీవు శక్తివంతుడిగా మలుచుకో
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
17. మానసిక కుంగుబాటు - ఆందోళన
దిగులు భయాల వలయంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి
సగం ఆట ఆడకముందే ఓటమిని ఒప్పుకుంటూ
జీవితమనే గొప్ప వరమును శూన్యము చేసుకొంటావా
అలసత్వాన్ని అంగీకరించని గుణముతో పోరాడి విజేతగా నిలబడు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
18. క్షణిక ఆకర్షణలు - దుష్కర్మలు
చెడు మార్గాల అయస్కాంత ఆకర్షణకు లోబడి
దీర్ఘకాలిక ఫలితాలను యోచించక తప్పులు చేస్తూ
కర్మఫలం అనుభవించేటప్పుడు దేవుణ్ణి కాపాడమని వేడుకొంటావు
దూరదృష్టితో ఆలోచించి వివేకముతో అడుగు ముందుకు వేయి
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
19. సోమరితనం - సాకులు
కష్టపడటం చేతకాక సాకుల వెనుక దాక్కుంటూ
శారీరక మానసిక సమతుల్యతను పూర్తిగా కోల్పోయి
ఆర్థిక స్వేచ్ఛను, కుటుంబ గౌరవాన్ని పణంగా పెట్టెదవు
విత్తినదే మొలుస్తుందని గ్రహించి కష్టపడి పని చేయు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
20. వృథా వాదనలు
గెలవాలనే అహంకారముతో నిరర్థక వాదనలు చేస్తూ
సత్యాన్ని గ్రహించే సువర్ణ అవకాశాన్ని వదలివేసి
మూర్ఖత్వపు చీకటిలో అజ్ఞానివై మిగులుతున్నావు
తార్కికముగా యోచించి ఇతరుల మాటలందలి నిజాన్ని విను
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!