Monday, March 18, 2024

వట్టి మాటలు కట్టిపెడదాం..నీటిని కాపాడే విప్లవానికి నాయకులమై నడుద్దాం అందరినీ నడిపిద్దాం.

త్రాగటానికి నీరు.. తల స్నానానికి నీరు..
చేయి కడగటానికి నీరు.. చెట్ల కోసం నీరు..
పల్లు తోమటానికి నీరు.. పండ్లు పండాలంటే నీరు.
వంట కోసం నీరు.. వంట పాత్రలు కడగటానికి నీరు..
నీరు మన జీవితం.. నీరు మన మనుగడకు ఆధారం.

మండుతున్నది భూగోళం మనం వాడే ప్లాస్టిక్ వలన.
విషతుల్యంగా మారే నదీనదాలు విసిరే వ్యర్థాల వలన.
రోజురోజుకూ తరిగిపోయే నీరు బాధ్యతాలేమి వలన.
క్షణ క్షణానికి క్షామం వైపు నీటిపై మననిర్లక్ష్యం వలన.
పేరుకు పెద్దచదువులు నీటిపై  శ్రద్దలేని చిన్నబుద్దులు.

నీరు లేని జీవితాన్ని ఆ నరకాన్ని ఊహించుకో
కోట్లుపెట్టినా కొనలేని ఆ అమృతం విలువ తెలుసుకో
కుండలతో కిలోమీటర్లు నడిచే వారిని గమనించు
ఎడారిగా మారుతున్న భూములను పరిశీలించు
మన అకృత్యాలే ఈఅనర్థాలకు పునాది అర్ధంచేసుకో

ఊపుకుంటూ కొట్టుకు వెళ్తాము.. వందల కొద్దీ ప్లాస్టిక్ సంచులు వేసుకొని తిరిగి వస్తాము..
పంపు తిప్పి పక్క చూపులు.. అనవసరంగా  వేలకొద్దీ గ్యాలన్ల నీటిని వృదా చేస్తాము.
ఒక్క సారి వేసుకొన్న బట్టలు.. ఉతకటానికి వాషింగ్ మెషీన్ నిండా నీటిని వాడతాము.
నీటి సీసాలు మోయటం అంటే నామోషీ.. నీరు ప్లాస్టిక్ సీసాలో త్రాగి ఎడమ చేత్తో విసిరి వేస్తాము.
ఆపాలి కాపాడాలి అని తెలిసినా.. నేనొక్కడినే ఆపితే ఈ లోకం గతి మారుతుందా అని మెట్ట వేదాంతాలు.

జరిగిన తరువాత అయ్యో అమ్మో అంటే అపగలవా?
ముందుచూపు లేకుండా మునిగి పోవటం సరియా?
చేతిలో ఉన్నప్పుడు వదిలేసి లబో దిబో అందామా?
రాబోయే ఉపద్రవం ఆపటానికి నడుం బిగించలేవా?

వట్టి మాటలు కట్టిపెడదాం..నీటిని కాపాడే విప్లవానికి నాయకులమై నడుద్దాం అందరినీ నడిపిద్దాం.


       ప్రభాకర రావు కోటపాటి
        18 మార్చ్ 2024


Saturday, March 16, 2024

ప్రగతిశీల భావజాలంతో భావితరాలను తయారు చేయుటమే జీవన సాఫల్యం..

చల్లని మలయ మారుతం విలువ ఎంత?
మనసును మురిపించే వెన్నెలను కొనగలవా?
ఆహారానికి ఆధారమైన ఆదిత్యుని ఆదేశించగలవా?
కష్ట సుఖాలలో తోడుండే స్నేహము ఖరీదు ఎంత?
కుటుంబగౌరవాన్ని నిలబెట్టే భార్యాబిడ్డల వెల ఎంత? తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ వేరేచోట దొరుకుతుందా?

నీవెంత గొప్పవాడివి అయినా హద్దులు దాటలేవు
నిలువెత్తు ధనమిచ్చినా నిమిషము నీ మాట వినదు
ఎంత బలవంతుడివి అయినా కాలానికి దాసుడవు
అబద్దం ఆశ్రితపక్షపాతం అవినీతికి అధోగతే చివరకు
దోపిడి దౌర్జన్యం దురాగతాలు చేర్చేది దుఃఖతీరాలు
అహంకారం అధికారమధం ల ఫలితం అవమానాలు

నీతి నిజాయతీ సంస్కారం నిజమైన అభరణాలు
ఆసక్తి అభిలాష అనుభూతి ఆనందం ఇంధనాలు
ఆప్యాయత అభిమానం సేవాభావం సాంప్రదాయాలు
అభివృద్ధి సమదృష్టి సమస్యపరిష్కారం విధానాలు
భూమి నదులు పర్వతాలు వృక్షాలు పూజ నీయాలు 
నిరంతరశ్రమ అకుంఠితదీక్ష లక్ష్యసాధన జీవిత సోపానాలు

పరిస్థితుల మెరుగుకై ప్రతి మనిషి చేయాలి సంకల్పం
మంచిని పెంచిపోషించటమే కావాలి అందరివిధానం
కాలమే జీవితం దాని సద్వినియోగమే సార్ధకం
ప్రకృతే ప్రాణికి ఆధారం దానిని కాపాడటమే కర్తవ్యం
అందరికీ మంచి చేయటమే నిజమైన నాయకత్వం
ప్రగతిశీల భావజాలంతో భావితరాలను తయారు చేయుటమే జీవన సాఫల్యం..


  - ప్రభాకర రావు కోటపాటి
     16 - మార్చి - 2024