Monday, June 12, 2017

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో మురిసెనులే మనసంతా..

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 
మురిసెనులే మనసంతా.. 
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 

ఎండిపోయిన మోడులన్నీ.. చిగురించేను సరికొత్త సొగసులతో
అడుగంటిపోయిన చెరువులన్నీ..   పొంగిపొరలేను కురిసే జలధారలతో

ఈ చినుకులే అమృత ధారలై .. నింపేనులే  ఈ జగమంతా.. పచ్చని మొక్కలతో.. 

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 

పెరిగిన ఆ పచ్చని చెట్లే.. నిండేను పక్షుల కిల కిలలతో.. 
పరుగెత్తే ఆ మేఘాలే .. ఆగి కలిసేను జలపాతాలతో.. 
జర జర పారె ఆ నదులే.. నింపేను భూమిని బంగారముతో

పొంగే పాడి పంటలే జనులకు సొంతమై.. 
విలసిల్లేను అందరూ సుఖ శాంతులతో.. 

పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో 
మురిసెనులే మనసంతా.. 
మురిసెనులే మనసంతా.. ఆ వర్షపు జల్లులతో
పిల్ల గాలుల సందడితో .. చిరుజల్లుల పండగతో

Sunday, June 11, 2017

పైర గాలి వీచింది... మేఘమాల పలికింది వాన జల్లు కురిసింది.. వాడిన చెట్టు లేచింది

పైర గాలి వీచింది...  మేఘమాల పలికింది 
వాన జల్లు కురిసింది.. వాడిన   చెట్టు  లేచింది 

భూమి పులకరించింది.. రైతు మనసు రమ్యమయింది.. 
ఎన్నో ఏళ్ళ ఎదురుచూపు.. నిజమై నిలిచింది.. 

మొలకెత్తే విత్తనాలే జన జీవనానికి ఆధారాలు 
వెల్లివిరిసే ఇంద్ర ధనుస్సులే దారి చూపే దివిటీలు.. 

చల్లనైన ఋతుపవనాలు వీస్తుంటే ఎదో తెలియని ఆనందం.. 
పోగుట్టుకొన్న నిధి ఏదో దొరికిందన్న సంబరం.. 

కోట్లిచ్చినా కొనగలమా జీవం నిండిన ఆ జలాన్ని.. 
తలక్రిందులుగా తపస్సు చేసినా తేగలమా రాని తొలకరిని.. 

ఎలినినో రక్కసిని ఎదిరించి గెలిచిన వరుణుడు.. 
మల్లెల వంటి జల్లులను కురిపిస్తుంటే.. 
పంటలన్నీ పచ్చగా కనిపిస్తుంటే.. 
అణిగి పోయిన రైతు ఆశలు చిగురుస్తుంటే.. 
చూడటానికి వేయి కనులు చాలవు.. 

ఇప్పటికయినా అర్ధం కావాలి.. 
ఏలినినో సృష్టికర్తలం మనమేనని 
మనం వదిలే పొగలే మనలను ముంచే మహమ్మారులని.. 

అందుకే మనందరం మారాలి.. 
పర్యావరణాన్ని రక్షించే సైనికుల లాగా.. 
అప్పుడే చూడగలం ఆహ్లాదకరమైన ఈ వాతావరణం ..

Saturday, June 3, 2017

పది మంది నడిచిందే బాట అవుతుందా? గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

పది మంది నడిచిందే బాట అవుతుందా?
గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

ప్రశ్నించకపోతే ఆంతరార్థం అర్ధమవుతుందా?
మూఢనమ్మకాలలో మునిగిపోతే మార్పు సాధ్యమవుతుందా? 

పొగ తాగితే స్వర్గానికి దగ్గర అవుతావన్నారు.. 
తరువాత తెలిసింది అది రోగాలకు రహదారి అని.. 

మందు తాగితే గాల్లో తేలతావన్నారు.. 
ఆ తరువాత అర్ధమయింది అది అణువణువుని ఆరగిస్తుందని . 

మన కులస్తులతోనే కలిసి తిరగాలన్నారు.. 
కాలక్రమంలో కనువిప్పయింది కులం కన్నా గుణం మిన్న అని.. 

మతానికి వేరు వేరుగా దేవుడుంటాడన్నారు.. 
మహానుభావుల భావాలతో బోధపడింది భగవంతుడొక్కడే అని.. 

డబ్బుతో కొనలేనిది ఏమీ లేదన్నారు.. 
ఎన్నో జీవితాలు చూస్తే జ్ఞానోదయమయ్యింది కాలాన్ని కొనగలిగే కోటీశ్వరుడు లేడని.. 

మనసుకి నచ్చినది తినటమే అనుభవించటమన్నారు.. 
తిన్న తరువాత తెలిసొచ్చింది ఆరోగ్యముంటే కానీ అనుభవించలేమని.. 

కత్తికి కత్తే సమాధానం చెప్పాలన్నారు ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నారు  .. 
పోతున్న ప్రాణాలను గమనిస్తే అనిపిస్తుంది ప్రేమే ఈ ప్రపంచాన్ని కలప గలిగే ప్రాణవాయువు అని.. 

అందుకే.. 

ఎంత మంది చెప్పారు అని కాదు.. 
ఎంత  నిజం చెప్పారు అనేది అర్ధం చేసుకో.. 

గుంపులో గోవింద కొట్టటం కాదు.. 
నీ గుండె చేసే గుస గుసలను గమనించు.. 

సమాజాన్ని మెప్పించడానికి జీవించవద్దు.. 
నిజాలనే నిప్పుతో నీ సమాజానికి వెలుగు చూపించు..

Saturday, May 27, 2017

సుర సుర లాడే సూర్య నారాయణుని కోపానికి కారణమేమిటో

సుర సుర లాడే సూర్య నారాయణుని కోపానికి కారణమేమిటో.. 
పచ్చనైన చెట్ల ఆచూకి కానరాలేదని క్రోధమా.. 

పొట్టలోని నీటిని బిడ్డల కోసం దాచే భూమి భగ భగల భావమేమిటో.. 
వరుణుడిచ్చే వాన నీటిని అపుతున్న ఆకాశ హర్మ్యాలపై ఆలకయిఉంటుంది.. 

నిండు కుండలా ఉండే మేఘాలు మొహం చాటు వేయటం వెనుక రహస్యమేమిటో.. 
తమకు ఊపిరి ఆడకుండా చేస్తున్న పరిశ్రమలొదిలే  పొగల మీద పంతమనుకొంటాను.. 

అడగకుండా అన్ని రకాల ఫలాలను అందించే ఫలవృక్షాల సంతాన లేమికి జరిగిన లోపమేమిటో.. 
ఇంకా ఇంకా కావాలనే తొందరలో వాటికిచ్చిన రసాయనాలను జీర్ణించుకోలేని జుగుప్స కావచ్చు.. 

ఇదంతా చూస్తూ  ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న మనుషుల మూఢ నమ్మకానికి ఆధారమేమిటో.. 
ప్రకృతి ప్రకోపానికి తమ పనులే కారణమని తెలుసుకోలేని తత్త్వం అయిఉంటుంది..

Saturday, May 20, 2017

జనం నీ జీవనంలో అంజనం కావాలి.. ప్రజలు నీ ప్రయాణంలో తోడు రావాలి..

ప్రతి మనిషి ఆలోచన ప్రత్యేకం..
అలా ఉండటమే ఈ సృష్టి ధర్మం.. 
అందరూ మనలాగే ఆలోచించాలి అనుకోవటమే అవివేకం..
అందరి అభిప్రాయాలను ఆదరించటమే ఆదర్శం.. 

ఎదుటి వారు చెప్పేది శ్రద్ధతో వినటం..
వారి వైపునుండి సమస్యను చూడటం..
మనస్పూర్తితో వారి మంచి కోరటం..
ఆవే మంచి మానవసంబందాల వెనుక రహస్యం.. 

నమ్మకమే మనుషులను నడిపించే బలం 
అనుమానమే అందరినీ విడదీసే అంకుశం
తోటివారిని నమ్మాలి తప్పు చేస్తే తెలియచెప్పాలి 
ఎవరినీ నమ్మలేని మనిషే అసలైన ఒంటరి 

మనం తీసుకొనే నిర్ణయాలే మన భవిష్యత్తు 
దూరద్రుష్టి లోపిస్తే వచ్చేదే స్వార్ధమనే మత్తు 
స్వంతలాభం కొంత మనుకొంటే మనుషులందరూ మన బంధువులే.. 
ఇరుగు పొరొగు తో కలిసిపోతే అందరూ మన స్నేహితులే.. 

మనమెంతో సాదించాలి కానీ తోటి వారి కన్నీటితో కాదు.. 
మనకు సుఖాలు కావాలి కానీ ఎదుటి వారిని ఏడిపించి కాదు.. 

జనం నీ జీవనంలో అంజనం కావాలి.. 
ప్రజలు నీ ప్రయాణంలో తోడు రావాలి..

Monday, May 15, 2017

అంతులేని మమకారమే అమ్మ..

అంతులేని మమకారమే అమ్మ.. 
బిడ్డ నవ్వు కోసం అడ్డమైన కష్టాలను ఇష్టంతో భరిస్తుంది అమ్మ.. 

కొడుకును కొండత్త ఎత్తులో చూడాలనుకొంటుంది అమ్మ.. 
పిల్లవాడు ఏమి చెప్పినా నమ్మేది అమ్మ మాత్రమే.. 

కుమార్తె భవిష్యత్తు బాగా ఉండాలని ఆమ్మ కోరుకోని క్షణం ఉండదు.. 
అమ్మాయి ఎంత ఎదిగినా అమ్మకు అమాయకురాలిగానే కనిపిస్తుంది.. 

తన సర్వస్వం పిల్లలకోసం ఇచ్చి వారి పిలుపుకోసం ఎదురు చూస్తుంది అమ్మ.. 
ఇచ్చినది గుర్తు ఉండదు.. తనకేమి కావాలో ఆలోచన ఉండదు.. తన కోసం చేసుకొనే తీరిక ఉండదు.. అమ్మకు 

అటువంటి అమ్మకోసం మనిషి ఏమి చేసినా తన ఋణము తీరదు.. 
ఆమెను బాధించే పనులు చేయటానికి మించిన మహా పాపం ఉండదు..

 ఈ లోకం లో అమ్మను మించి మనిషి మంచి కోరేవారు ఉండరు..

Saturday, May 13, 2017

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి 
నీ అద్భుతాలు వ్రాయటం అసలైన అసాధ్యం..

గింజ గింజను నీ పొట్టలో దాచుకొంటావు.. 
వాటిని మొక్కలుగా మార్చి వృక్ష సంపదను రక్షిస్తావు.. 

మలినమైన నీటిని శుద్ధి చేసే అతి పెద్ద యంత్రానివి నీవు.. 
మరలా మరలా మురికి వదిలించి మంచి నీటిని అందిస్తావు.. 

అనంత కోటి జీవరాశులకు ఆశ్రయం నీవు.. 
అన్ని జీవులకు సరిపడా ఆహారాన్ని అందిస్తావు.. 

అంతం లేని శక్తి సంపద సమాహారం నీవు.. 
చమురు, బొగ్గు, లవణాలు, లోహాలు అన్నింటినీ అందిస్తూనే ఉంటావు.. 

ఎటువంటి పదార్దాన్నైనా నీలో కలుపుకొంటావు.. 
తిరిగి వాటినే పనికి వచ్చే పదార్థాలుగా మారుస్తావు.. 

చెత్తా చెదారాన్ని ప్రేమతో స్వీకరిస్తావు.. 
వాటికి విలువను జోడించి జీవరాశికి అందిస్తావు 

నీవు తర తరాలకు ఇస్తూనే వస్తున్న మహా దాతవు 
సృష్టిస్తావు, పంచుతావు, పునరుజ్జీవింప చేస్తావు.. అంతులేని ప్రేమతో.. 

ఓర్పుకే నిర్వచనం నీవు.. 
మతిలేని మనుషులు చేసే   వినాశనాన్ని వినమ్రంగా భరిస్తావు.. 

నీవు లేకపోతే మాకు భోజనం లేదు.. 
నీవు లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు.. 

యుగ యుగాలుగా నీ నుండి తీసుకొంటూనే ఉన్నాము..
బోధించి, దీవించి మమ్ములను నీ నిజమైన భక్తులుగా మార్చు..

భూమి ఓ నా బ్రహ్మాండమైన భూమి.. 
నీవు అణువణువు అద్భుతాల హారానివి.