Sunday, July 26, 2026

ప్రభాకర శతకం (Prabhakara Sathakam) - భాగం 1 (పద్యాలు 1-10)

ప్రభాకర శతకం (Prabhakara Sathakam)

- భాగం 1 (పద్యాలు 1-10)

సృష్టిలోని వైరుధ్యాలను, మానవ స్వార్థాన్ని ప్రశ్నిస్తూ సాగే సామాజిక-తాత్విక కవితా సంకలనం.

1. దైవత్వం

తమకు నచ్చినట్లు దైవ రూపము జేసి
పరుల దైవమెల్ల తప్పు లనగ
ప్రకృతి సర్వమొక్క జగత్కర్త సృష్టి అని ఎరుంగవు
సకల జీవులందు దైవత్వమును గాంచుటే ధర్మము
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

2. కర్మఫలం

శ్రమను వీడి సులభ ధనము కోరుకొని
అడ్డదారులందు పరుగులెత్తినన్
వివాదములు తగాదాలు మిగిలే చివరకు
సన్మార్గమున కష్టపడి సంపాదించుటే రక్షణ కవచము
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

3. దేహమే దేవాలయం

అర్ధరాత్రి బిర్యానీలు కోలా పానీయములతో
నూనె నిండిన తిండ్లు ఆహారములను తింటూ
మంచిని మరచి రోగాలను కొనితెచ్చు కొనెదవు
నియమాలతో దేహాన్ని కాపాడుకొనుట అవశ్యము
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

4. పితృరుణం

కన్నవారిని మరచి కడుపున పుట్టిన వారే లోకమని
నీ అస్తిత్వానికి మూలమైన వృద్ధులను విస్మరిస్తే
రేపు నీ పిల్లలు నిన్ను వదిలి పరాయి వాడిని చేయరా
కన్నవారిని ప్రేమతో సేవించుటే నీ కర్తవ్యము
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

5. ప్రకృతి ధర్మం

భూమిని ప్లాస్టిక్ కుప్పలతో ఇష్టా రీతిని నింపుతూ
విచక్షణ లేక ప్రకృతిని క్షణ క్షణం వినాశనం చేస్తూ
పాడైపోయిన భూమిలో ఆహారం పండక అల్లాడేవు
ప్రకృతిని రక్షించి ప్లాస్టిక్‌ను విడనాడి జీవించుటే వివేకం
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

6. నిశ్శబ్ద ప్రార్థన

ధనముతో కానుకలతో దేవునికి లంచము ఇస్తావు
సృష్టిలోని తోటి జీవుల బాధలను విస్మరిస్తావు
సృష్టికర్త ఆజ్ఞను మరచి స్వార్ధముతో బ్రతుకుతావు
మానవులకు, మూగజీవులకు సేవయే పరమార్ధము
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

7. ప్రజాస్వామ్య భ్రమ

ఓటు కోసం కుల మతాలు డబ్బు ముఖ్యమంటావు
నిజాయితీ నాయకుడిని గుర్తించుటే మరచి పోయావు
అవినీతి పాలనలో దేశము చిక్కినా అనవసరం నీకు
అవినీతి రహిత యోగ్యుడినే ఎన్నుకొనుటే నీ బాధ్యత
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

8. విద్యా వినాశనం

కన్నవారి కష్టార్జితాన్ని విలాసాలకు తగలేస్తూ
చదువును వీడి విచ్చలవిడి స్నేహాలలో మునిగేవు
బాధ్యత మరచి చివరకు నిరుద్యోగిగా మిగిలేవు
లక్ష్యం వైపు శ్రద్ధతో చదివి నీ భవితను బాగు చేసుకో
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

9. అత్యాశ

అధిక వడ్డీలని అమాయకంగా మోసగాళ్లను నమ్మేవు
వివేకమును వదలి దురాశ కూపములో పడిపోయేవు
చేతులు కాలి చట్టాన్ని నిందిస్తూ నిస్సహాయుడయ్యెవు
అడ్డదారి లాభాలు వదిలి కష్టార్జితాన్ని జాగ్రత్త పరచుకో
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!

10. వేగ వినాశనం

అతివేగమే గొప్పని సురక్షిత ప్రయాణాన్ని విస్మరించేవు
అనుభవముంది గదా అని అజాగ్రత్తతో బండి తోలేవు
ప్రమాదాలు నీ అహంకారాన్ని ఎప్పుడూ క్షమించవు
నిరంతర మెలకువలతో సురక్షితంగా ప్రయాణించు
నిత్యమిది, సత్యమిది, ప్రచ్ఛన్న ప్రభాతమిది!
Prabhakar Rao Kotapati


Saturday, June 20, 2026

ధగ ధగ లాడే సూర్యుడిలో మండే కొండలెన్నో 
చల్ల చల్లనైన చంద్రుడిలో నీటి గుంటలెన్నో 
జల జల కురిసే మేఘాలలో ఆవిరి కుండలెన్నో 
పచ్చ పచ్చని పంట భూమిలో తిరిగిన హలాలెన్నో 

రంగు రంగుల పూల వెనుక మొక్క కష్టం ఎంతో 
ఘుమ ఘుమల వంటల కోసం రైతు శ్రమ ఎంతో 
తల తల లాడే చీరల కొరకు నేతన్నల యాతన ఎంతో 
రయ్యి రయ్యిన పోయే బండ్ల శ్రామికుల చెమట ఎంతో 

బ్రతికి బట్ట కట్టిన మన కోసం తల్లి మోసిన భారం తెలుసా
విలాసవంతమైన మన జీవితం కోసం తండ్రి తపన తెలుసా
విజ్ఞానం మనలో నింపడానికి గురువుల త్యాగం తెలుసా
స్వాతంత్ర్యం మనకు అందించటానికి వీరుల రక్తం తెలుసా 

అంతా నేనే అనే అహంకారం నాకే కావాలి అనే ఆరాటం 
ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టే తెంపరితనం 
మూలాలను మర్చిపోయి విపరీత బుద్ధులతో మూర్ఖత్వం 
అందరి శ్రమలను అనుభవిస్తూ అంతా దోచుకొనే స్వార్థం 

ఊరికే ఏదీ రాలేదు ప్రతి సుఖం వెనుక కష్టం ఉంది 
నీవు ఒక్కడివే ఎదగలేదు వెనుక ఎంతో మంది కృషి ఉంది 
ఆనందం స్వార్థంలో లేదు అందరి కోసం చేసే మంచిలో ఉంది 
గొప్పతనం సంపదలో లేదు సమసమాజ నిర్మాణంలో ఉంది 

అనంతమైన విశ్వం పరమార్థం తెలుసుకున్న విజ్ఞానిగా మారు
విశాల హృదయం విలువ తెలుసుకున్న సేవకునిగా మారు
నిజమైన ఆనంద మార్గం కనిపెట్టిన జీవన శాస్త్రవేత్తగా మారు
మరచిపోలేని సేవలు మానవాళికి ఇచ్చిన నాయకునిగా మారు


       - ప్రభాకర రావు కోటపాటి 
          20 జూన్ 2026




Sunday, November 9, 2025

ఈ విశాల విశ్వంలో నీ గమనం ఒక ఘన చరిత్ర కావాలి

ఈ విశాల విశ్వంలో నీ గమనం ఒక ఘన చరిత్ర కావాలి 
నీ ప్రతి ప్రయత్నంలో ప్రజా సేవా సుంగంధాలు విరియాలి 
నీవు నడిచిన నేల నిన్ను తనపై మోసినందుకు మురవాలి 
నీవు నిర్మించిన దారిలో వేలాది మంది గమ్యాలను చేరాలి 

ఎన్ని కోట్లు సంపాదించావో కాదు .. ఎన్ని జీవితాలు మార్చావు?
ఎన్ని ఉత్సవాలు జరిపావో కాదు .. ఎంత మందికి వెలుగయ్యావు?
ఎన్ని సార్లు దేవునికి మొక్కావో కాదు.. ఎన్ని సామాజిక సమస్యలు పరిష్కరించావు?
ఎన్ని సంవత్సరాలు బ్రతికావో కాదు.. పోయిన తరువాత ఎన్ని గుండెలలో ఉంటావు?

బ్రతకటం అంటే అర్థం .. సకల జీవరాశితో అనుబంధం 
ఆనందం అంటే అర్థం .. ప్రకృతి తో కలిసి ప్రయాణం 
జ్ఞానం అంటే అర్థం.. ప్రతి పనిలో విజ్ఞత విలీనం చేయటం 
నాయకత్వం అంటే అర్థం.. నిస్వార్థ మార్గ దర్శకత్వం 

ప్రకృతి నిర్మించిన అద్భుతం మన జీవితం
సమాజం చెక్కిన శిల్పం మన సింహాసనం 
మన మంచి పనులే మన భువన విజయాలు 
అందరి సమస్యలను పరిష్కరించడమే.. అంతిమ లక్ష్యం.

            - ప్రభాకర రావు కోటపాటి 
                9 - నవంబర్ - 2025




Friday, February 7, 2025

రోజు రోజుకూ కలల కోటలను నిర్మిస్తూ కదిలిపో

ఎగుడు దిగుడు దారి నీ ముందున్నపుడు
ఎదురు గాలులు ఉవ్వెత్తున వీస్తున్నపుడు 
ఎటు చూసినా అయ్యోమయ్యంగా ఉన్నప్పుడు
ఎలాగైనా సాధించాలి అనే సంకల్పాన్ని వాడు

అవరోధాలు నీ నడకను నిదానం చేయవచ్చు 
అవి అలుపెరుగని పోరాటంతో దారి ఇవ్వక తప్పదు
నీవు పొందే ఓటమి నీకు తగిలే ప్రతి ఎదురు దెబ్బ
నీలో ధైర్యం నింపాలి. నీ సంకల్పబలం పెరగాలి

నీ ఆశయాలు ఆకాంక్షలు లక్ష్యాలు పెద్ద పెద్ద కలలు
నిరంతరం నీ గుండెల్లో రగిలి దారి చూపే దివిటీలు
కష్టనష్టాల కారుమబ్బులు నలుదిక్కుల కమ్మినపుడు
దారి చూపే వెలుగు నడిపే మెరుపు నీలోనే నిక్షిప్తం 
 
తలపైకెత్తి గుండెల్లో  నమ్మకంతో అడుగులు వేయు
జీవిత పోరాటాన్ని అందరూ అనుసరించేలా చేయి
అడ్డుగోడలు ఆవిరిఅవుతాయి వేదన దరి చేరదు 
విజేత గా విలసిల్లు తావు మార్గదర్శిగా మారుతావు

నీ గుండెను ఉక్కు లాగా మార్చుకో 
నీ దృష్టిని దిక్సూచి లాగా మార్చుకో
అడుగులో అడుగు వేస్తూ లక్ష్యం చేరుకో
రోజు రోజుకూ కలల కోటలను నిర్మిస్తూ కదిలిపో

ప్రభాకర రావు కోటపాటి 
7 Feb 2025


Sunday, January 19, 2025

ధర్మనిరతి,  ధర్మపరిరక్షణ తోనే ఆ ధర్మమూర్తి దర్శనం

ఏడుకొండల స్వామిని ఎలుగెత్తి పిలిస్తే..
ఎదలో కొలువై నెలవై దయతో దీవించడా.
వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం దొరకాలని..  
ప్రాకులాడి ప్రాణాలతో చెలగాటం అవసరమా..

ఎవరో ఏదో చెప్పారని.. నీకేదో దొరకదని..
వేలం వెర్రిగా..గుడ్డిగా నమ్ముతావా..
తొక్కిస లాటలు.. కుమ్ములాటలు..
దేవ దేవుడు అవి చూసి నిన్ను దీవిస్తాడా

ప్రేమ, భక్తి, అనురాగం, ఆసక్తితో ఆహ్వానిస్తే..
సర్వాంతర్యమి కనుల ముందు సాక్షాత్కారం కాడా
నిర్మలమైన మనస్సు.. నిజాయితీ నిండిన నడక
నీ మార్గమైతే ఎల్లప్పుడూ ఆయన నడిపించడా..

ఎన్నో దేవాలయాలు ఎన్నో నామధేయాలు..
అన్ని చోట్ల కొలువై ఉన్నది ఆది నారాయణుడు కాదా
ప్రక్రుతి లో ప్రకాశించే ప్రతి జీవరాశి ఆయన సృష్టి 
సకల జీవులలో ఆ జ్యోతిర్మయుని సందర్శించ లేవా..

నీ దేహమే దేవాలయం.. నీ హృదయమే దేవుని పీఠం
నీవు ప్రక్రుతి కి ప్రాణ కోటి కి చేసే సేవే నిజమైన ప్రార్థన
అనేక పాపాలతో ఆలయంలో ప్రవేశిస్తే ప్రక్షాళన కాదు
ధర్మనిరతి,  ధర్మపరిరక్షణ తోనే ఆ ధర్మమూర్తి దర్శనం



         -- ప్రభాకరరావు కోటపాటి 
                19 జనవరి 2025



Thursday, December 19, 2024

అర్ధం పర్ధం లేని పనులతో వ్యర్థ పదార్థం కావొద్దు

మా అభిమాన కథా నాయకుడంటావు
తన కోసం చొక్కాలు చించుకొంటావు
పనులన్నీ వదిలి తన వెంట పరుగు పెడతావు 
తన కోసం ఇతరులతో గొడవలు పడతావు 
మొదటి ఆట కోసం నీ కష్టాన్ని దారపోస్తావు
నీ శ్రమతో తనని కోటీశ్వరున్ని చేస్తావు

అవసరమా మనకు అర్ధం లేని ఈ ఆరాటం
ఎప్పటికీ తెలుసు కుంటావు ఈ నిప్పులాంటి నిజం

నీ కోసం అహర్నిశలు తపించే తల్లిదండ్రులు
నీ విజ్ఞానం కోసం ఆరాటపడే అధ్యాపకులు
నీ ఆహారం కోసం మండే ఎండలో కష్టించే కర్షకులు
నీ సౌకర్యాల కోసం క్రమశిక్షణ నిండిన కార్మికులు 
నీ రక్షణ కోసం ప్రాణాలు సమర్పించే సైనికులు
నీ భవిష్యత్తు కోసం అన్నీ.వదిలేసే సంఘ సేవకులు

నీ కోసం ఎంత చేస్తున్నారో ఆలోచించావా క్షణకాలం 
వారే నీవు ఆరాధించ వలసిన నిజమైన నాయకులు

నీవు శ్రమిస్తేనే సుఖ సంతోషాలు అవుతాయి సొంతం
నీవు  క్షణ క్షణం సాధన చేస్తేనే చేరుకుంటావు కలల తీరం
నీవు ఏకాగ్రతతో కృషిచేస్తేనే ఎదుగుతావు నిరంతరం 
నీవు అభ్యసిస్తేనే అందుకుంటావు విజయాల శిఖరం 
నీవు విజ్ఞతతో మసలితేనే నడుస్తావు అభివృద్ది పథం

అందుకే
నీ ప్రతి పనిలో పరమావధిని  గుర్తించి ప్రవర్తించు 
నీ ప్రతిభతో లోకం మెచ్చుకొనే దారిలో పయనించు 

ఎవరి స్వార్థం కోసమో నీవు సమిధ గా మారొద్దు 
అర్ధం పర్ధం లేని పనులతో వ్యర్థ పదార్థం కావొద్దు 


                 - ప్రభాకర రావు కోటపాటి 






Sunday, May 12, 2024

తెలుగునాడు కీర్తి ప్రజ్యలింప చేసే కర్తవ్యబద్దులం

తేనెలొలుకు తెలుగుతో తియ్యనైన కవితా ప్రబంధాలు అందించిన నేల తెలుగునాడు

పరవళ్ళు తొక్కే కృష్ణ గోదావరి తుంగభద్ర అనేక నదులకు నెలవైన అమృతధార తెలుగునాడు

అఖండ భారతావనికి అనేక ఆహార పదార్థాలను ధాన్య రాశులను అందించు అన్నపూర్ణ తెలుగునాడు

ఎనలేని త్యాగ ధనులను స్వాతంత్ర్య యోధులను  కవి సామ్రాట్టులను  కన్నతల్లి తెలుగునాడు

తెలుగు ప్రభలను వెలిగించు విద్యా వేత్తలను శాస్త్రవేత్తలను అందించిన సరస్వతిదేవి తెలుగునాడు

కూచిపూడి ఆంధ్రనాట్యం ఒగ్గుకథ బుర్రకథ హరికథ పద్యనాటకం అనేక కళలకు నెలవు తెలుగునాడు

పచ్చని పొలాలు వృక్ష సంపద పక్షి సమూహాలు పర్వత శ్రేణులతో అలరే ఆనందసీమ తెలుగునాడు

నిర్నిబంద నియమపాలకులైన నాయకుల జనరంజక పాలన ఘనచరత్రతో నిండిన జీవనాడి తెలుగునాడు

అజరామర నిరంతర సంపదకు వారసులం మనం
దీక్షానిబద్దులమై పూర్వీకుల పరంపరకు భాద్యులం

తెలుగునాడు కీర్తి ప్రజ్యలింప చేసే కర్తవ్యబద్దులం


      - ప్రభాకర రావు కోటపాటి 
             12 మే 2024