Monday, June 1, 2020

కర్తవ్యానికి కట్టుబడే వాడే కధానాయకుడు

ఆనందం లోకంలో ఉండదు 
అది చూసే కనుల నుండి పుడుతుంది 
అన్ని కనులు ఆనందాలు అనుభవించలేవు
వాటికి కళలను ఆస్వాదించే రసజ్నత కావాలి

కష్టాలు లేని జీవితం కలలో కూడా జరుగదు 
అడ్డుగోడలను అదిగమించటమే ఆనందం 
ఎదురు దెబ్బలు  ఎంతటి వారికైనా సహజం
కానీ గెలవాలి అనే తపనే నడిపించే ఇందనం 

దారిలో గొయ్యి ఉంటుంది నుయ్యి ఉంటుంది 
కదలక పోతే  కల ఎలా నెరవేరుతుంది?
ఊరక కూర్చున్నా ఆయువు తరిగిపోతుంది
సాదించటానికి చేసే కృషిలో ఆనందముంది 

వదలటానికి వంద కారణాలు చెప్పవచ్చు 
చేయటానికి చేయాలనే కోరికే కారణం 
వదిలే వానికి మిగిలేది కూడా ఉండదు 
కర్తవ్యానికి కట్టుబడే వాడే కధానాయకుడు 


        - ప్రభాకర రావు కోటపాటి
                02-జూన్-2020


Monday, May 4, 2020

ఎందుకు మనకీ మందు బానిసత్వం?

తపన ఒకటే తపన..
మందు కోసం ఒకటే తపన..
అది లేకపోతే వళ్ళంతా కుత కుత..
ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూపులు..

ఎందుకు మనకీ మందు బానిసత్వం?

మందు లేక పొతే పొద్దు పోదు..
అది పడక పొతే పండుగ జరగదు..
ఓటు వేయాలంటే బాటిల్ ఇవ్వక తప్పదు..
దేశమెటుపోయినా మన మత్తు దిగదు..

ఎప్పటికి ఆపుదాము ఈ ఆత్మ వంచితం?

కరోనా కోసం కొట్టు కట్టేస్తే..
నాటు సారా కోసం నరాలు లాగుతాయి.
వందది వెయ్యికి అమ్మినా..
ఆస్తులు అమ్ముకొని మరీ తాగుతాము.
ఒక పక్కన వైరస్ ఉప్పెన వచ్చినా..
ఆఖరి గుక్కేసి పాడె ఎక్కుతాము.
శరీరం సిక్కి శల్యమవుతుంటే..
మనసుతో మాత్రం స్వర్గంలో విహరిస్తాము

అర్దమవుతుందా మన దారితప్పిన జీవితం?

కొట్టు తెరుస్తున్నారు అంటే కోటి సంబరాలు..
రేట్లుపెంచారు అంటే అరువుకోసం పరుగులు.
తాగకురా చెడేవు అంటే  మూతి విరుపులు..
అనారోగ్యం అయితే ఆరోగ్యశ్రీ వైపు చూపులు

ఇలాగే కొనసాగితే..

ఎప్పటికిచేద్దాం సంపూర్ణమద్యపాన నిషేదం?



      - ప్రభాకర రావు కోటపాటి



Sunday, May 3, 2020

ఆ వైద్య సిబ్బందికివే శత కోటి వందనాలు

వైద్యం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి
సొంత కుటుంబాన్ని దూరంగా పెట్టి
గాలి చొరబడని దుస్తులను వంటికి కట్టి
అంతు తెలియని పోరాటానికి నడుం కట్టి 

ఆ వైద్య సిబ్బందికివే శత కోటి వందనాలు..

కనిపించదు తెల్లకోటు వెనుక మీ ఆత్మ క్షోభ 
వినిపించదు రోగి కోసం మీరు పడే ఆవేదన
తెలియదు రక్కసిపై పోరాటంలో మీ త్యాగం 
వెలకట్టలేదు ఈ సమాజం మీ సేవాభావం 

అందుకే అన్నారు వైద్యో నారాయణో హరిహి

రసాయనాలతో చేయక తప్పదు స్నానం 
వత్తుకు పుండ్లుపడినా విప్పలేరు మాస్కులు
కనపడనిశత్రువు అయినా అపాలనే ఆరాటం
కంటికి నిద్ర కరువు కానీ కాపాడాలనే కోరిక

అందుకే సరిలేరు మీకెవ్వరు ..

మరువలేనిది మీరు చేసిన మేలు
తిరుగులేనిది  మీ సేవా నిరతి 
అందుకే ప్రజావాహిని కురిపిస్తుంది 
మీపై పుష్పాంజలి 

               - ప్రభాకర రావు కోటపాటి
                      02 - మే - 2020
  
 

Sunday, April 26, 2020

అనందం అనుభవించు.. ఆచరించకు అరిషడ్వర్గానికి బానిసత్వం

అందరికీ వస్తుంది..వదిలి పోయే సమయం 
చివరకు మిగిలేది.. మనం పంచిన ఆనందం 
అందుకే చేయలి.. మిగిలేవి కలకాలం 
సమయాన్ని గడపాలి.. అందిస్తూ అనుబందం

పొరుగు వారికి చేయి.. చేతనైన సహాయం
అభాగ్యులకు అందించు.. ఆపన్న హస్తం
వికలాంగులకు చూపించు..బ్రతికే విశ్వాసం 
ప్రజలందరకి పంచు.. నిస్వార్థ  స్నేహం

కష్టాలు వచ్చేను.. కానీ ఉండవు కలకాలం 
నష్టాలు నడిచేను.. జయించేవు మరుక్షణం 
సంకల్పమే నీ బలమైతే..వరించేను విజయం 
వైఫల్యమే నీ సోపానమైతే..చేరేవు లక్ష్యం

ధనం సంపాదించు.. విడువకు ధర్మ మార్గం 
షడృచులు భుజించు..వదలకు ఆరోగ్యదర్మం
భందువులను పోషించు..
మరువకు వసుదైక కుటుంబం
అనందం అనుభవించు.. 
ఆచరించకు అరిషడ్వర్గానికి బానిసత్వం 


- ప్రభాకర రావు కోటపాటి






Friday, April 24, 2020

దయ రాదా.. మాపైన నీ దయ రాదా..

దయ రాదా.. మాపైన నీ దయ రాదా..
ఇకనైనా ఆపరాదా మమ్ములను కాపాడరాదా
ఈశ్వరా ఈ ప్రళయాన్ని ఆప రాదా..
స్తంభించిన ప్రపంచాన్ని తిరిగి నడిపించరాదా

కరుణించ రావా .. కవచమై రక్షించ రావా
కంటికి కనపడని కర్కశి కరోనాను కట్ట రావా 
కరుణామయా ఈ విద్వంసాన్ని  నిలుపరావా 
దద్దరిల్లు మరణమృదంగాన్ని ముగించ రావా 

ప్రాణాలుతీసే మహమ్మారిని మట్టుపెట్ట లేవా 
దహిస్తున్న ఆ దెయ్యాన్ని దండించ లేవా 
దైవమా ఈ దుస్తితిని దూరం చేయ లేవా
కల్లోలరహిత ప్రపంచాన్ని పునరుద్దరించలేవా 

తెలియకచేసిన మా తప్పులను తుడిచివేయి 
వణికిపోతున్న జనులకు తోడువై కాపాడు  
భగవంతుడా ఈ భడభానలనాన్ని  చల్లార్చు 
మానవ జాతికి సంతోష జీవితం ప్రసాదించు.


   -ప్రభాకర రావు కోటపాటి 


Saturday, December 21, 2019

ముందే మేల్కోవటం.. అత్యంత అవశ్యకం..

ఉరకలెత్తే కొండవాగును కనులారా చూసా..
కొండంత ఆంబోతు ప్రేమ చూసి పరవశించా..
శునక సంబరాన్ని చూసి అబ్బుర పడ్డా..
చెట్టు మీద పండిన సీతాఫలం చవి చూసా..

చెల్లించింది లేదు.ఆనందం మాత్రం అనంతం..

నవ నవ లాడే వంకాయలను కోసుకొన్నా..
కమ్మనైన గంగి గోవు పాలు తనివితీరా త్రాగా..
తెల్లని ప్రత్తి పూలను పూజకోసం సేకరించా..
అందని బొప్పాయిని పెద్ద కర్రతో కదిలించా..

చిన్న చిన్న పనులు. అందులో ఎదో ఆహ్లాదం..

నీరు పోస్తే తలలూపే చెట్టు కొమ్మల చైతన్యం.
సుగందాలను వెదజల్లే విరజాజి వయ్యారం.
బరువైన కాయలను మోసే సొర తీగ బలం.
రకరకాల మొక్కలతో భూమి మాయాజాలం.

మనం గమనించం.. కానీ అదొక అద్భుతం 

డబ్బుతో అనందం వస్తుందనేది విడ్డూరం..
ధరతో విలువ పెరుగుతుందనేది వట్టి దగా..
కోట్ల కోసం పరుగులో కరిగిపోయే కాలం..
చివరకు మిగిలేది ఏమిటో తెలియని తత్వం..

ముందే మేల్కోవటం.. అత్యంత అవశ్యకం..



సాధించాలనే తపనే గెలిపించే ఇందనం

మారుమూల పల్లెలో పుట్టాడు
బడి కూడా లేని బడుగూరు 
ఖర్చుతో చదివించలేని కుటుంబం
ఉన్నత శిఖరాలను సాధించాలనే తపన 
అనాధ శరణాలయంలో ఆశ్రయం 
అందిన అవకాశాన్ని సద్వినియోగం 
ప్రతి పరీక్షతో ప్రగతిపధంలో ప్రయాణం 
అన్నివైపులా అందిన అందలాలు 

సాధించాలనే తపనే గెలిపించే ఇందనం

అదొక వృత్తి విద్యా సంస్థ
చదువు కొనాలి అనుకొనే వారే అధికం
చెప్పే పాటం మీద కన్నా గోల మీదే ద్యాస 
అందులో ఉన్నది ఒక ఆణిముత్యం 
తను మాత్రం గుంపులో కలిసే రకం కాదు 
మానవాళికి మేలు చేసే పని మీద లక్ష్యం
ప్రతి క్షణం సరికొత్త విధానాల కొరకు శోధన 
అనేక సమస్యలను అరికట్టే ఆవిష్కరణలు 

గమ్యంపై లక్ష్యమే పరిస్తితులను గెలిచే మార్గం

సాధారణ ఉద్యోగి 
పెద్ద పెట్టుబడి పెట్టే శక్తి లేదు 
అత్యుత్తమ సేవల సంస్థ స్తాపించాలి
వినియోగదారులను ఆకర్షించే శక్తి లేదు 
నిజాయతీ నిబద్దతలే నడిపించే చక్రాలు 
నమ్మి వచ్చిన సంస్థలకు నమ్మకమైన సేవలు
దిన దినాభివృద్ది చెందిన వ్యాపారం
తన సంస్థకు ప్రపంచంలో  ప్రముఖస్థానం 

నిజాయితీ సామర్డ్యాలే నిజమైన పెట్టుబడి 

మనసా వాచా కర్మణా లక్ష్యముంటే 
దానికోసం అనుక్షణం అంకితమయితే 
నిజాయతీ నిబద్దత నీ రెండు కనులయితే 
అన్ని శక్తులు నీలోనికి వచ్చి చేరుతాయి
అప్పుడు ఆకాశమే నీ హద్దు అవుతుంది 
నీకు గెలవటమే అలవాటు గా మారుతుంది 

                   - ప్రభాకర రావు కోటపాటి