Sunday, November 6, 2016

కానీ వారిని సృష్టించిన స్రుష్టి కర్తకు ఇదే నా మనవి.. వారి మానసిక వ్యాధిని త్వరగా నయం చేయాలని

పది మంది తిరిగే పార్కులలో పగల కొట్టిన మందు సీసాలు 
మూర్ఖ శిఖామణులు మన మధ్య ఉన్నారని చూపే చేదు నిజాలు 

మత్తెక్కితే మదం హెచ్చుతుందా లేక మనలను ఎవరు అడుగుతారు అనే అహంకారామా.. 

ఎన్ని రకాల అనర్థాలు ఆ పగిలిన గాజు పెంకులతో 

తెలియక కాలు వేసి రక్తం చిందే మూగ జీవులు 

భూమిలో కలవని ఆ గాజు ముక్కలు మట్టిలో దాగివుండే కత్తులు.. 

చెట్లను పెంచే తోట మాలికి తెఛ్చి పెడతాయి అనుక్షణం ఆపదలు..

ఇన్ని అనర్థాలకు మూలము ఆ మందుబాబుల మనసులేని అకృత్యం.. 

భూమి నాశనం..  పరిసరాలు అపరిశుబ్రం 
మొక్కలు పెంచలేము.. చెల్లా చెదురయిన ముక్కలను వేరలేము.. 

అర్ధం పర్థం లేని ఆనందానికి ప్రకృతి మాతకు చెరగని గాయం.. 

ఎవరో తెలియదు.. ఎలా వారిలో మార్పు తేవాలో తెలియటం లేదు.. 

కానీ వారిని సృష్టించిన స్రుష్టి కర్తకు ఇదే నా మనవి.. 

వారి మానసిక వ్యాధిని త్వరగా నయం చేయాలని









Sunday, October 30, 2016

ఇకనైనా ప్రకృతి వ్యవసాయాన్ని అర్ధం చేసుకొందాం.. విధాత నిర్దేశించిన విధానంలో అమృత ఆహారాన్ని పండిద్దాం

ఎవరు వేసారు ఆ విత్తనాలు 
ఎవరు నాటారు ఆ మొక్కలు 
ఎవరు వేస్తున్నారు ఎరువులు 
ఎవరు చల్లుతున్నారు పురుగు మందులు 

దట్టమైన అడవి .. పురుగులు కొరకని ఆకులు 
అనేక రకాల మొక్కలు.. తెగుళ్లు కానరాని పచ్చదనాలు
ఆకాశాన్ని అంటే ఎదుగుదల.. కన్నుల పండగగా పూలు 
ఎటు చూసినా తరగని అందాలు.. ఎంత చూసినా తనివితీరని  ప్రకృతి ప్రమోదాలు 

ఎన్నో పుస్తకాలు చదివాము .. కనులముందున్న ఈ అద్భుతాలను గమనిస్తున్నామా?
పట్ట బద్రులమే కానీ .. ప్రకృతి నేర్పే సహజ వ్యవసాయాన్ని అర్ధం చేసుకొంటున్నామా?
పరిశోధనలు చేసి మరీ పురుగు మందులు తయారు చేస్తాము.. కానీ 
కాణీ ఖర్చు లేకుండా పురుగుల్ని తరిమే వేప నూనె, గోమూత్రాన్ని విలువించం

టన్నుల కొద్ది ఆహారాన్ని పండిద్దామని చూస్తాం..  
విషతుల్యమైన ఆహారాన్ని ఏమి చేసుకొందాం?

ఇకనైనా ప్రకృతి వ్యవసాయాన్ని అర్ధం చేసుకొందాం.. 
విధాత నిర్దేశించిన విధానంలో అమృత ఆహారాన్ని పండిద్దాం

పండుగ కావాలి కానీ ఆ పేరుతో పర్యావరణాన్ని పాడు చెయ్యద్దు

ఎక్కడి నుండి వచ్చింది ఈ టపాసులు పేల్చే సంస్కృతి 

దీపావళి అంటే దీపాల ద్వారా లక్ష్మి దేవికి స్వాగతాంజలి 

ఈ శబ్దాల తాకిడికి ఆమెకే చిరాకు పుట్టే పరిస్థితి 

చెవులకు చిల్లులు, దారులన్నీ కాగితాలమయం, పీల్చే గాలిలో రసాయనాల విలీనం, విలువైన 
ధనం అగ్గిలోన ఆవాహనం

ఎవరు పుట్టించారో తెలియదు, ఏ పురాణం లో వ్రాసుందో తెలియదు. 
పక్కింటి వాడు పది వేల సామాను కాల్చాడు నేను ఇరవై వేలు కాల్చాలి అనే పంతం 
సందులో సందని చైనా నుండి టన్నులకొద్దీ టపాసుల ప్రవాహం 
వృధాగా జాతీయ ధనం బూడిద మయం 

ఇంకొక ప్రక్క బాల కార్మికులతో టపాసుల తయారి 
అగ్ని ప్రమాదాల్లో అమాయక బాలల  బలి 

అవసరమా మనకి  ఈ అర్ధం లేని ఆనందం 
ఎంతకాలం ఆడదాం  ఆ అగ్ని తో  చెలగాటం 

మరొక ప్రక్క మన పైశాచిక శబ్ద కాలుష్యానికి బెదిరిపోయే మూగ ప్రాణులు 
వాతావరణ సమతుల్యానికి క్షణ క్షణం తూట్లు 

కూర్చున్న చెట్టు  కొమ్మనే నరుక్కొనే అవివేకులు
గుంపులో గోవిందలు కొట్టే గొర్రెల మందలు 

మతం  కావాలి కానీ మూఢ నమ్మకాలు వద్దు 
పండుగ కావాలి  కానీ    ఆ పేరుతో పర్యావరణాన్ని పాడు చెయ్యద్దు 


Sunday, January 11, 2015

ఇదే నిజమైన కాల జ్ఞానం.... అదే మన పుట్టుకకు అసలైన కారణం....

తరిగి పోయేది నీ జీవితం 

పరిమితమైనది ఈ భూమి పైన నీ సమయం

నీవు ఆపలేనిది ఆ కాల గమనం 

కాలాన్ని కొనాలని చూసావా భంగపడతావు 

ఆ ఉరవడిని ఆపాలని ప్రయత్నించావా ఆబాసు పాలవుతావు 

దానిపై పెత్తనం చెలాయించాలని తలచావా ఆవిరై పోతావు 

విజ్ఞత తో నీవు చేయ గలిగింది తెలుసుకో

రోజు రోజుకూ నీ పరిణత పెంచుకో 

ప్రతి క్షణాన్ని స్నేహ పరిమళం తో నింపుకో 

ఆ గమనం లో ఆనందాన్ని ఆస్వాదించు 

ఆ పయనం లో మంచిని పెంచి పోషించు 

నీ బుద్దిబలముతో సమస్యలకు పరిష్కారం చూపించు 

నిన్ను నడిపించాలి నిర్మాణాత్మకమైన ఆలోచనలు 

నిన్ను కదిలించాలి నీ తోటి వారి అభిమాన కుసుమాలు 

నీ జన్మకు అర్దము కల్పించాలి నీవలన నెరవేరిన కార్యక్రమాలు 

ఇదే నిజమైన కాల జ్ఞానం.... 

అదే మన పుట్టుకకు అసలైన కారణం....  

Monday, April 21, 2014

జీవించటం అంటే తినటం, తాగటం, తిరగటం అని చెప్పారు కొందరు

జీవించటం అంటే తినటం, తాగటం, తిరగటం అని చెప్పారు కొందరు..

ఆనందించటం అంటే విచ్చలవిడితనం, పెత్తనం చేయటం, ఆస్తులు సంపాదించటం అన్నారు కొందరు.. 

పైకి ఎదగటం అంటే అధికారాన్ని సాధించటం, ఎలాగైనా విజయం పొందటం, అందరూ మనచుట్టూ తిరగటం  అని బదిలిచ్చారు ఇంకొందరు.....

నీవు పోయినా మిగిలి ఉండే పనులు చేయటమే జీవించటం అని నేర్పింది నా జీవితం...

క్రమ శిక్షణ, బాద్యతాయుత ప్రవర్తన, అందరిని కలుపుకొని నడవటం, మన మంచికోసం ఎదురుచూసే మనుషులే ఆనందం అని తెలియచేసింది నా అనుభవం...

నీవు పరిష్కరించిన సమస్యలు, నీవలన జరిగిన అభివృద్ధి, ఇంకా ఇంకా చేయాలి అనే తపనే నీ ఎదుగుదలకు కొలమానం అని వివరించింది నా విచక్షణా జ్ఞానం..  

Tuesday, March 25, 2014

మనుషులంతా ఒక్కటే అని మన సృష్టికర్త ఒక్కరే అని నీకు అనిపించటం లేదా

కులాల కుమ్ములాటలో నీవూ ఒక ఖడ్గంగా మారావా 
మానవత్వంలేని మత మౌడ్యంలో నీవూ ఒక మారణాయుధం గా మారావా 
జబ్బులాంటి జాత్యహంకారానికి నీవూ ఒక జన్మ ఖైదీ గా మారావా 
నీకు తెలియకుండా నీలో చేరిన ఆ భూతాలను గమనించ లేవా 
మనుషులంతా ఒక్కటే అని మన సృష్టికర్త ఒక్కరే అని నీకు అనిపించటం లేదా 
ఎన్ని తెలుసుకున్నా ఎంత చదువుకున్నా నీకు ఈ నిజం జీర్ణం కావటం లేదా  

Saturday, March 22, 2014

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం..నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

అణువణువునా అలసత్వం
అడుగడుగునా అవినీతి 
అడిగేవారు లేరనే అహంకారం 
డబ్బు పెట్టి ఓట్లు కొనే అవకాశం
అన్నీ కలిస్తే రాజకీయం 

కులం చూసి ఓటు వేస్తాం 
మతమే మనకు ముఖ్యం 
మందు ఇస్తేనే పోలింగ్ కి వెళతాం
ధనం కోసం దేశాన్ని అమ్ముతాం
కానీ కావాలి మనకు మంచి నాయకత్వం 

గుంటలు పడిన రోడ్లు చూస్తే మనకు రోత 
కల్తీ కలిసిన సరుకులు చూస్తే మనకు కోపం 
కరెంటు కోత భరించలేక భగ భగ మంటలు 
త్రాగటానికి నీరు లేక ఎండిపోయే గొంతులు 
వీటన్నిటికి ఎవరో కారణం అనుకొనే అజ్ఞానం 

పై పై మాటలు నమ్ముతాం 
పుకార్లే మనకు ఆహారం
లేదు విశ్లేషించి అర్ధం చేసుకొనే సమయం
ఇవ్వము మంచివాళ్ళకు అవకాశం
మన బలహీనతలతో స్వార్ద నాయకుల వీర విహారం 

ఎవరో మారాలని ఎదురుచూస్తాం 
సైనిక ప్రబుత్వం తో మార్పు వస్తుందంటాం
ఈ దేశాన్ని ఎవరూ మార్చలేరని జోస్యం
మా అన్న తిన్నా చేస్తాడు అనే మొండి వాదం
మారాల్సింది మనమే అనేది మాత్రం గుర్తించం 

దేశం ఏమైపోయినా, నాకు నా ఆనందమే లోకం 
గ్రామాలు మండిపోతున్నా, నాకు నా విందు వినోదాలు అవసరం 
ఈ సంఘాన్నిమార్చగల సత్తా ఉన్నా, నా అలవాట్లు నా ప్రాణం 
నాకు నా కుటుంబం ముఖ్యం, నా బందువులు ముఖ్యం, స్నేహాలు ముఖ్యం, టి వి ప్రోగ్రాములు ముఖ్యం, చాటింగ్ ముఖ్యం, మేసేజులు ముఖ్యం, గుసగుసలు ముఖ్యం.
రోము నగరం తగలబడుతుంటే నీరు చక్రవర్తి పిడేలు వాయిద్యం

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం....
నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

కనులుంటే గమనిస్తావు
చెవులుంటే వింటావు 
చేతులుంటే నిరూపిస్తావు 
మనసుంటే విశ్లేషిస్తావు 
విశ్వాసముంటే నీ తోటి పౌరులను చైతన్య పరుస్తావు 

నీ ఓటు హక్కుని మంచి నాయకుని గెలిపించటానికి ఉపయోగిస్తావు  
మనిషివైతే నీ దేశం కోసం నీ ధన మనః ప్రాణాలను వెచ్చిస్తావు

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం..
నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

                                                                                                                                                 --ప్రభాకర రావు కోటపాటి