Saturday, March 22, 2014

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం..నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

అణువణువునా అలసత్వం
అడుగడుగునా అవినీతి 
అడిగేవారు లేరనే అహంకారం 
డబ్బు పెట్టి ఓట్లు కొనే అవకాశం
అన్నీ కలిస్తే రాజకీయం 

కులం చూసి ఓటు వేస్తాం 
మతమే మనకు ముఖ్యం 
మందు ఇస్తేనే పోలింగ్ కి వెళతాం
ధనం కోసం దేశాన్ని అమ్ముతాం
కానీ కావాలి మనకు మంచి నాయకత్వం 

గుంటలు పడిన రోడ్లు చూస్తే మనకు రోత 
కల్తీ కలిసిన సరుకులు చూస్తే మనకు కోపం 
కరెంటు కోత భరించలేక భగ భగ మంటలు 
త్రాగటానికి నీరు లేక ఎండిపోయే గొంతులు 
వీటన్నిటికి ఎవరో కారణం అనుకొనే అజ్ఞానం 

పై పై మాటలు నమ్ముతాం 
పుకార్లే మనకు ఆహారం
లేదు విశ్లేషించి అర్ధం చేసుకొనే సమయం
ఇవ్వము మంచివాళ్ళకు అవకాశం
మన బలహీనతలతో స్వార్ద నాయకుల వీర విహారం 

ఎవరో మారాలని ఎదురుచూస్తాం 
సైనిక ప్రబుత్వం తో మార్పు వస్తుందంటాం
ఈ దేశాన్ని ఎవరూ మార్చలేరని జోస్యం
మా అన్న తిన్నా చేస్తాడు అనే మొండి వాదం
మారాల్సింది మనమే అనేది మాత్రం గుర్తించం 

దేశం ఏమైపోయినా, నాకు నా ఆనందమే లోకం 
గ్రామాలు మండిపోతున్నా, నాకు నా విందు వినోదాలు అవసరం 
ఈ సంఘాన్నిమార్చగల సత్తా ఉన్నా, నా అలవాట్లు నా ప్రాణం 
నాకు నా కుటుంబం ముఖ్యం, నా బందువులు ముఖ్యం, స్నేహాలు ముఖ్యం, టి వి ప్రోగ్రాములు ముఖ్యం, చాటింగ్ ముఖ్యం, మేసేజులు ముఖ్యం, గుసగుసలు ముఖ్యం.
రోము నగరం తగలబడుతుంటే నీరు చక్రవర్తి పిడేలు వాయిద్యం

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం....
నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

కనులుంటే గమనిస్తావు
చెవులుంటే వింటావు 
చేతులుంటే నిరూపిస్తావు 
మనసుంటే విశ్లేషిస్తావు 
విశ్వాసముంటే నీ తోటి పౌరులను చైతన్య పరుస్తావు 

నీ ఓటు హక్కుని మంచి నాయకుని గెలిపించటానికి ఉపయోగిస్తావు  
మనిషివైతే నీ దేశం కోసం నీ ధన మనః ప్రాణాలను వెచ్చిస్తావు

నీ దేశం అక్రోసిస్తుంది నీ సేవ కోసం..
నీ మాతృభూమి తీర్చమంటుంది నీ ఋణం..

                                                                                                                                                 --ప్రభాకర రావు కోటపాటి

Monday, April 8, 2013

అందుకే ఈ సమాజం నీకోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి

రాళ్ళతో కొడితే పారి పోయెను ఒకడు
ఆ రాళ్ళనే ఏరి దుర్గాన్ని కట్టె నొకడు
రాళ్ళతో కొడితే పారిపోయేవాడు పిరికివాడు
ఎదురు తిరిగే వాడు మొండివాడు
ఆ రాళ్ళనే ఏరి విజయం అనే దుర్గాన్ని కట్టేవాడు నిజమైన నాయకుడు
ఇతరులను దోచుకొని సంపాదించటం రాక్షస తత్వం
తనచుట్టూ గిరిగీసుకొని బ్రతకటం స్వార్ద తత్వం
తనివ్వ గలిగినది పంచుకొని జీవించటం మానవత్వం
సేవా తత్వాన్ని నింపుకొని అందరినీ ఆదుకోవటం దైవత్వం
మానవత్వం దైవత్వం కలిసి ఉండటమే నాయకత్వం
నిద్రలో వచ్చే కలలకు తృప్తి పడేవాడు నిద్ర బోతు
పగటి కలలతో కాలక్షేపం చేసేవాడు సోమరిపోతు
కలలను కర్తవ్యాలుగా మార్చుకొనేవాడు కాల జ్ఞాని
కలలకోసం నిద్రనే త్యాగం చేసేవాడు మార్పు ప్రతినిధి
కర్తవ్యాన్ని మంచి మార్పుకోసం కొనసాగించేవాడు సంఘ సంస్కర్త
నీవు ఉన్నతంగా ఎదగటానికి నీకు ఈ సమాజం కావాలి
నీవు ఎదిగిన తరువాత ఈ సమాజానికి నీవు కావాలి
నీ ముందుతరాలకు నీవు మంచి సమాజాన్ని అందించాలి
నీవు పోయినతరువాత కూడా ఈ సమాజం నిన్ను గుర్తుంచుకోవాలి
అందుకే ఈ సమాజం నీకోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి
 
---- ప్రొ. వంగపల్లి విశ్వనాధం మరియు శ్రీ. సయ్యద్ రఫీ గార్ల ఉపన్యాస స్పూర్తి తో...








Monday, January 28, 2013

చేదు సత్యం మింగ గలిగితే జీవితం వైద్యాలయం..అడుగు తప్పక ఆడ గలిగితే అవనియే నృత్యాలయం


నింగిలోతును చూడ గోరితే నీటి చుక్కను కలుసుకో
రత్నతత్వం చూడ గోరితే రాతి ముక్కను కలుసుకో
అణువు నడిగితే తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో
మౌన శిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో
మనిషి మూలం చూడ గోరితే మట్టిగడ్డను కలుసుకో

సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా
హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా
తలుపులు కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా..
తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా
ముసురుకోచ్చే ముదిమి తన వల విసరకుంటుందా

ఎక్కడో అందనిది ఉందని అపేక్షించకు మిత్రమా
ఎదట ఉన్నది నీది కాదని ఉపేక్షించకు నేత్రమా
చిన్న దీపం మేలుకాదా చీకటింట్లో గడపగా
రాని దానికి అనుక్షణము నిరీక్షించకు హృదయమా
రాయినైనా మాటి మాటికి పరీక్షించకు దైవమా

రాలిపోయే ఆకులను ఎవరాపినా ఏముందిలే
ఊడిపోయే జుట్టును ఎంతగా వత్తినా ఏముందిలే
వప్పకున్నా కొన్ని మార్పులు తప్పవేమో ప్రకృతిలో
కరిగిపోయే మంచునెంతగా కప్పినా ఏముందిలే
కరిగిపోయే వయసునెంతగా దాచినా ఏముందిలే

చేదు సత్యం మింగ గలిగితే జీవితం వైద్యాలయం
మనసుపుటలను చదవ గలిగితే అనుభవం విద్యాలయం
ఎవ్వరో నేర్పాలనే బ్రమ ఎందుకంట వృధా.... వృధా..
అడుగు తప్పక ఆడ గలిగితే అవనియే నృత్యాలయం
కనులు తిప్పక చూడగలిగితే అణువణువు తత్వాలయం

పంటలెన్నో ఇంట ఉన్నా పరిగలేరిస్తుంది లోభం
పెట్టె లోపల గవ్వ ఏదని చెత్త వెతికిస్తుంది లోభం
లోభ తత్త్వం అంతు పట్టదు లోని పొరలను చీల్చకుంటే
ఉన్న కాస్తా కలత నిదురను ఊడ్చిపారేస్తుంది లోభం
మనిషి మనసును కాటి దిబ్బగా మాడ్చి మసి చేస్తుంది లోభం

                                            ----డా. సి. నారాయణ రెడ్డి


Friday, January 25, 2013

నిజాయితీకి కట్టుబడక ప్రజలను ఎలా పాలిస్తావు

చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు
నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు
ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకొంటే
చేయి జారి పోతుంటే జీవితాన్ని నిందించకు
కలం వ్రాయలేకుంటే కాగితాన్ని నిందించకు
 
గాలిలోన ఎగిరి పడే గడ్డిపరక ఊపిరెంత
ఏటిలోన తుళ్ళిపడే నీటి బుడగ ఉనికిఎంత
అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఎం లాభం
కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత
నడమంత్రపు సిరినేర్పిన దుడుకు బుద్ది దూకుడెంత
 
ఒక్క చినుకు చాలు మట్టి కుప్పను మొలిపించాలంటే
ఒక్క చెనుకు చాలు నవ్వుల చుక్కలు మెరిపించాలంటే
ఊహల్లో గీసుకొన్న యూహాలకు విలువేముంది
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరిలించాలంటే
ఒక్క కుదుపు చాలు పుడమి ముక్కను కదిలించాలంటే
 
విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగోస్తేనే
పరిణత మతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే
పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా..ఎలా..
పరమ నీతి మొలకెత్తదు ప్రమాణాలు చెల్లిస్తేనే..
అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే..
 
అలలు ఉప్పొంగే కడలికే ఆటైనా..పోటైనా...
చేవ ఉన్న వృక్షానికే చిగురైనా..చీడైనా....
రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి..
ప్రాణమున్న దేహానికే పడకైనా...నడకైనా..
రచ్చకెక్కు ఆసామికే రాల్లైనా..పూలైనా..
 
ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు
ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు
బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో
ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు
ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు
 
విధికి నీవు శిరసొగ్గితే విరుగుతుంది వెచ్చని రక్తం
సిరికి నీవు మనసోగ్గితే మరుగుతుంది ఆరని స్వార్ధం
నువ్వు పుట్టిందేందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు
ఉత్త అరుపులోనైనా వొలుకుతుంది చిక్కని అర్ధం
వోల్లకాటిలోనైనా పలుకుతుంది పచ్చని గీతం
 
తాడు బొంగరం లేక క్రీడ ఎలా చూపిస్తావు
నారు లేక నీరు లేక పైరు ఎలా పండిస్తావు
ఈ కబుర్ల టైర్ల గాలి ఎపుడో దిగిపోయిందబ్బో..
పదం లేక స్వరం లేక పాట ఎలా పలికిస్తావు
నిజాయితీకి కట్టుబడక ప్రజలను ఎలా పాలిస్తావు
 
 
                        ----డా. సి. నారాయణ రెడ్డి
 
 
 
 
 
 
 

SWAMY VIVEKANANDA


 

 


Sunday, January 20, 2013

నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం..


నా మనసేమి చెప్తుందో మీకందరికీ వినిపించాలని ఉంది 
మీకందరికీ చెప్పమని  అది నన్ను ఊపేస్తూ ఉంది..

అందరినీ పిలిచి అరచి చెప్పమంటుంది ..
సభలే పెట్టి విడమర్చి చెప్పమంటుంది...

చెప్పమంటారా ఆ లోతైన నిజం..
వినిపించమంటారా నా విన్నపం..

మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఈ  జీవితం..తరిగిపోతుంది మేలుకో   జీవితం..
చేయాలనుకున్న మంచిపనులు చేసి ఆనందించు   జీవితం 
నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం 

చెప్పాలి చెప్పాలి  అని లబ డబ మంటుంది నా గుండె చప్పుడు.. 
మీకు అర్దమయితే అదే పదివేలు అంటుంది నా పిలుపు..

మనలను ఉసికొలిపే  ఉత్పత్తులు..
మాయలో మనలను ముంచే ప్రలోభాలు..
మన చేత్తో మన కంటినే పొడుచుకొనేటట్లు చేసే అలవాట్లు..
ఇతరులను ముంచి ఎదగాలనే వెర్రి ఆలోచనలు..

బయట పడకపోతే ఎందుకూ పనికిరాదు మన జీవితం..
వినకపోతే విరిగిపోతుంది విలువైన నీ జీవితం..

విషాన్ని వెదజల్లుతున్న విద్వేషాలు..
అంతా మాకే కావాలనే ఆరాటాలు..
పనిచేయకుండా ఫలితాలు ఆశించే దురాశా పాశాలు..
కామంతో కళ్ళు మూసుకుపోయే క్రూరత్వాలు..

చివరకు మిగిలేది ఏమిటో జ్ఞానం లేకపోతే అంతా శూన్యం 
పోయేటప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంతా అయోమయం..

ముందుగా మేలుకొంటే మధురం ఈ జీవితం 
ఏడుస్తూ వచ్చాము...నవ్వుతూ ముగించాలి  ఈ జీవితం..
మనము పోయినా పదికాలాలు గుర్తుండాలి మన జీవితం..

మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఈ  జీవితం..తరిగిపోతుంది మేలుకో   జీవితం..
చేయాలనుకున్న మంచిపనులు చేసి ఆనందించు   జీవితం 
నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం..



Saturday, January 12, 2013

కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..




ప్రపంచాన్ని తన లోతైన ప్రవచనాలతో కదిలించిన కొదమ సింహం..

విద్వేషాలతో విడిపోతున్న జనులకు విశ్వమానవ మతాన్నిపరిచయం చేసిన విజ్ఞాన విహంగం..

మనిషి ఎలా జీవించాలో ఎలా ఆలోచించాలో నిగ్గు తేల్చిన నిప్పు రవ్వ..

బానిసత్వంలో అలసత్వంతో మగ్గుతున్న భారత యువతను స్వాతంత్ర సాధన వైపు నడిపిన స్ఫూర్తి ప్రధాత..

ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి మూడువందల తొంబై సంవత్సరాల సమానమైన సేవ చేసిన మహా నాయకుడు...

ఆయనే..అనన్య అసమాన్యుడు....
ఆయనే..స్వామి వివేకానంద.....

ఆయన పేరు వింటేనే ఆత్మ విశ్వాసం నిద్ర లేస్తుంది..

ఆయన వ్రాసిన అక్షరాలు చదివితేనే సాధించాలనే ఉద్రేకం ఉప్పెనవుతుంది..

ఊహ కందని మేదస్సు అయన సొంతం..
పరిపూర్ణమైన దేశభక్తి అయన ఆసాంతం..

దనానికి దాసుడవ్వలేదు...
మోహాలకు తావివ్వలేదు..
దురలవాట్లకు బానిసవ్వలేదు...

యువశక్తి ఈ దేశాన్ని మారుస్తుంది అని ఎలుగెత్తి చాటిన పరమహంస ప్రియ శిష్యుడు..

శిధిలమవుతున్న భారత సంస్కృతిని తన అమృత వాక్కులతో నిలబెట్టిన ఆరాధ్య పురుషుడు..

అటువంటి స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనందరి అదృష్టం..

ఆయన రచనలలో ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం..
ఆయన సలహాలలో ఎన్నో సమస్యలకు సమాధానం..

ప్రతి భారతీయుడు తప్పక చదివి పాటించాల్సినవి అయన సూచనలు..
ప్రతి యువకుడు విధిగా నేర్చుకోవాల్సినవి అయన నిర్దేశాలు..

మనము ఆచరించవలసిన జీవన శైలికి...
మన ప్రతి జాతీయ సమస్యకు...
భారతీయ యువత ఔన్నత్యానికి..
విశ్వానికి నాయక గా మన దేశాన్ని నిలపటానికి.. 
కావలసిన నిఘంటువు...స్వామి వివేకానంద.....

ఇకనైనా కళ్ళు తెరుద్దాం..
అయన మనకిచ్చిన అపార విజ్ఞాన సంపదను గుర్తిద్దాం..
ఆ మహానుబావుని కలలు నిజం చేద్దాం...

కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..