Saturday, May 7, 2022

మంచిని ప్రేమించి ప్రోత్సహించి పెంపొందించు..చెడును చండ శాసనంతో వేళ్ళతో పెకలించు..

అసంతృప్తి అశాంతి అభద్రత ఆందోళన
అవసరమా మనకు ఆ అనవసర భారం..
పరుగులు పొట్లాటలు పగలు ప్రతీకారాలు
చివరకు నష్టం మనకే అని గుర్తించలేదా..
కావాలి ఇంకా కావాలి అంతా నాకే కావాలి
కాలక్రమంలో అన్నీ వదిలి పోవాలని తెలుసా..
దొడ్డి దారులు దొంగ తనాలు బలాత్కారాలు
చేరుకొనేది ఇక్కట్లు కొట్లాటలు కట కటాలు..

నువ్వేమి ఇస్తావో తిరిగి  అదే పొందుతావు
నువ్వేమి ఆలోచిస్తావో అదే అవుతుంది..
ధర్మం నీతి నిబద్దత నిజాయితి సత్యం 
మనలను కాపాడే సహజ వజ్ర కవచాలు..
ప్రేమ ఆప్యాయత సర్వ జీవుల హితం 
నాయకునిగా నీ శిరస్సు మీద కిరీటాలు..
ఆనందం ఆత్మసంతృప్తి  అభిమానం
నీకు అందే వెల కట్టలేని సిరి సంపదలు..

అధికారదాహం దురహంకారం దురాక్రమణ
మూర్ఖ మానవులు చేసే విశృంఖల విహారం..
వ్యతిరేకత తిరుగుబాటు విప్లవం రక్తపాతం
వారికి చరిత్రలో మిగిలే గుర్తింపు పత్రాలు..
విద్వంసం విచిత్ర ధోరణి వికృత చేష్టలు 
తామే శాశ్వతం అనుకొని బ్రతికే బ్రమ జీవులు
నేనుచెప్పిందే జరగాలి నాకునచ్చింది చేయాలి
ఆ  విపరీత బుద్దే అన్ని సమస్యలకూ మూలం

ఈ విశాల ప్రకృతిలో మనమొక పరమాణువు
చేతనైన మంచిచేయటమే మనుగడ మూలం
పది మంది మేలు కోరటమే జీవన మంత్రం
తోటిజీవుల స్వతంత్రతను హరించటం పాపం
నీవునడిచేబాట అనేకమందికి ఆదర్శంకావాలి
కులం మతం జాతి మనలను విడదీయరాదు
మంచిని ప్రేమించి ప్రోత్సహించి పెంపొందించు
చెడును చండ శాసనంతో వేళ్ళతో పెకలించు


             ప్రభాకర రావు కోటపాటి
                     7 మే 2022











No comments:

Post a Comment