వికసించిన పుష్పాలను చూసి విప్పారతాయా నీ కనులు?
ఉదయించే ఉదయభానుని వీక్షించి
ఉరకలేస్తుందా నీ ఉత్సాహం?
మట్టిని చీల్చుకొని పైకిలేచే మొలకను చూసి
ఉప్పొంగుతుందా నీ హృదయం?
పసి పిల్లల చిల్లర ఆటలు గమనించి
చిరునవ్వు చిందుతుందా నీ మోములో?
అసలైన ఆనందాన్ని గుర్తించారని అర్దం..
ఆనందానికి అవసరం .. ఆత్మ సంతృప్తి
మనశ్శాంతికి అవసరం.. స్పందించే గుణం
పరిపూర్ణతకు అవసరం..నిజాన్ని గుర్తించే శక్తి
జీవితానికి అవసరం.ప్రకృతితో సహప్రయాణం
విచ్చలవిడితనంతో వచ్చేది వికృత వికారం
విశృంఖల అలవాట్లు చేర్చేది అథఃపాతాళం
అధర్మ అనువర్తన నడిపించేది నరకప్రయాణం
అసత్య భాషతో అందేది అవమానాల కిరీటం
సృష్టి నియమాల పాలన యే పరమ సోపానం
సకల జీవులతో అనుబంధమే ఆనందగమనం
అజాత శతృవుగా జీవితమే దివ్య అలంకారం
పరమాత్మ అనుసంధానమే ఆత్మసాక్షాత్కారం
- ప్రభాకర రావు కోటపాటి
05 మార్చి 2022
No comments:
Post a Comment