Sunday, October 11, 2020

మన అవసరాలకు చివరి చిరునామా ప్రకృతి

విరిజల్లులకు పరవశించే.. 
వరిచేల వయ్యారం చూడు
పిల్లగాలులకు తలలూపే..
జొన్నచేల సంబరం చూడు
నులివెచ్చని కిరణాలకు మెరిసిపోయే..
కందిచేల అందం చూడు
మేఘాలను తాకి పులకరించే..
తాటిచెట్టుల సందోహం చూడు 
ప్రకృతి స్పర్శతో  అవి పొందే అనందం చూడు

పచ్చ గడ్డి తిని స్వచ్ఛమైన పాలిచ్చే..
గంగి గోవుల గొప్పతనం చూడు
వట్టి మట్టి తిని సత్తువైన ఎరువునిచ్చే..
వాన పాముల అద్భుతం చూడు
ఏది పెట్టినా తిని తరగని ప్రేమ చూపే..
శునకముల స్నేహభావం చూడు
పువ్వు పువ్వు పై ఎగిరి ఫలీదకరీంచే..
తుమ్మెదల సహకారం చూడు
మనిషికోసం తోటిజీవుల సంఘీభావం చూడు

ప్లాస్టిక్ సంచులు సీసాలు విసిరేస్తే..
వినాశనమవుతున్న జీవులను గమనించు 
మత్తు పదార్దాలను విచ్చలవిడిగా వాడే..
వ్యసనపరుల చివరి అవస్తలను గమనించు
సహజ ఆహార నియమాలను వదిలేస్తే..
విరుచుకుపడే విచిత్ర రోగాలను గమనించు 
పచ్చటి చెట్లను కొట్టేసి కాంక్రీటు నింపితే..
ఉక్కపోతతోమగ్గిపోయే జనులను గమనించు
మనిషికి ఇతర జీవుల శైలికి తేడా గమనించు 

జీవులమనుగడ ఆనందానికి ఆధారం ప్రకృతి
నియమాలు పాటించేవారికి సొంతం ప్రకృతి
కోట్లకు పడగలెత్తిన వారికీ అతీతం ప్రకృతి 
దారి తప్పిన వారికి సింహ స్వప్నం ప్రకృతి 
మన అవసరాలకు చివరి చిరునామా ప్రకృతి 

   - ప్రభాకర రావు కోటపాటి
       11- అక్టోబర్ - 2020
 






No comments:

Post a Comment