Saturday, June 27, 2020

వానమ్మా వానమ్మా నీకు వందనమమ్మా

ఉరుములు మెరుపులతో వస్తావు 
నేలను పచ్చ పచ్చగా చేస్తావు 
వాగులు వంకలను కదిపేవు 
నదుల నడకకు ప్రాణమై నిలిచేవు
వానమ్మా  వానమ్మా నీకు వందనమమ్మా 

విత్తు విత్తుకు కావాలి నీ విరిజల్లులు
చెట్టు చెట్టుకు జీవం నీ జలధారలు
బొట్టు బొట్టుతో  పెరిగేను  పరిసరాలఅందాలు
ప్రాణి ప్రాణికి ఆధారం నీఅమృత బిందువులు 
వానమ్మా  వానమ్మా నీకు వందనమమ్మా 

నిండుగా ఉన్నప్పుడు తెలియదు నీ విలువ
ఎండిపోయినప్పుడు దొరకదు నీటి చుక్క
పాడుచేసే మనుషులకు పట్టదు నీ కొరత 
అన్నీ మరచి కురిసేను నీ మమతల వర్షం 
వానమ్మా  వానమ్మా నీకు వందనమమ్మా

నీ రాక కరువైతే నేల మారేను ఎడారిగా
నీఉనికి దూరమైతే ఊహించలేము ఉపద్రవం
నీకుతప్పదు అందరి కాలుష్యాలను కడగటం 
ఎప్పటికి తెలుసుకుంటుందో ఈసభ్యసమాజం
వానమ్మా  వానమ్మా నీకు వందనమమ్మా

 - ప్రభాకర రావు కోటపాటి, 27 జూన్ 2020


No comments:

Post a Comment