Saturday, June 3, 2017

పది మంది నడిచిందే బాట అవుతుందా? గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

పది మంది నడిచిందే బాట అవుతుందా?
గుడ్డిగా అన్నీ నమ్మితే జీవితం మనదవుతుందా?

ప్రశ్నించకపోతే ఆంతరార్థం అర్ధమవుతుందా?
మూఢనమ్మకాలలో మునిగిపోతే మార్పు సాధ్యమవుతుందా? 

పొగ తాగితే స్వర్గానికి దగ్గర అవుతావన్నారు.. 
తరువాత తెలిసింది అది రోగాలకు రహదారి అని.. 

మందు తాగితే గాల్లో తేలతావన్నారు.. 
ఆ తరువాత అర్ధమయింది అది అణువణువుని ఆరగిస్తుందని . 

మన కులస్తులతోనే కలిసి తిరగాలన్నారు.. 
కాలక్రమంలో కనువిప్పయింది కులం కన్నా గుణం మిన్న అని.. 

మతానికి వేరు వేరుగా దేవుడుంటాడన్నారు.. 
మహానుభావుల భావాలతో బోధపడింది భగవంతుడొక్కడే అని.. 

డబ్బుతో కొనలేనిది ఏమీ లేదన్నారు.. 
ఎన్నో జీవితాలు చూస్తే జ్ఞానోదయమయ్యింది కాలాన్ని కొనగలిగే కోటీశ్వరుడు లేడని.. 

మనసుకి నచ్చినది తినటమే అనుభవించటమన్నారు.. 
తిన్న తరువాత తెలిసొచ్చింది ఆరోగ్యముంటే కానీ అనుభవించలేమని.. 

కత్తికి కత్తే సమాధానం చెప్పాలన్నారు ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నారు  .. 
పోతున్న ప్రాణాలను గమనిస్తే అనిపిస్తుంది ప్రేమే ఈ ప్రపంచాన్ని కలప గలిగే ప్రాణవాయువు అని.. 

అందుకే.. 

ఎంత మంది చెప్పారు అని కాదు.. 
ఎంత  నిజం చెప్పారు అనేది అర్ధం చేసుకో.. 

గుంపులో గోవింద కొట్టటం కాదు.. 
నీ గుండె చేసే గుస గుసలను గమనించు.. 

సమాజాన్ని మెప్పించడానికి జీవించవద్దు.. 
నిజాలనే నిప్పుతో నీ సమాజానికి వెలుగు చూపించు..

No comments:

Post a Comment