భూమిని చీల్చుకొని పైకొచ్ఛే మొలకనడిగా.. నీకా శక్తి ఎలా వచ్చిందని..
ఆకాశాన్ని అందుకోవాలనే అలుపెరుగని ఆరాటం నుండి అంది..
మండే ఎండను తాను భరిస్తూ చల్లని నీడనిచ్చే చెట్టునడిగా.. నీకంత ఓర్పు ఎలా వచ్చిందని..
అట్టడుగు పొరల్లో దాగి ఉన్న నీటి కోసం చేసే నిరంతర పోరాటం నుండి అంది..
యజమానిని చూడగానే ఆనందంతో చిందులేసే కుక్క పిల్లనడిగా .. నీకంత అభిమానం ఎలా వచ్చిందని..
తనను ప్రేమగా చూసుకొనే మనిషిపై ఉన్న మమకారం నుండి అంది..
కటిక చేదు వేపాకును ఎంతో ఇష్టంగా తింటున్న మేకనడిగా .. నీకు ఆ ఆకులు తినే ధైర్యము ఎలా వచ్చిందని..
రోగాలు రాకుండా వేప చేసే మేలు మీదున్న నమ్మకం నుండి అంది..
పగలంతా దుక్కి దున్ని అలిసిపోయిన మహా నందిని అడిగా నీకా శ్రమించే గుణం ఎలా వచ్చిందని..
జీవులందరికీ ఆహారం అందించాలనే నాయకత్వం నుండి అంది..
అప్పుడు అర్ధమయింది నాకు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అయిదు శక్తుల గురించి..
అవే.. ఆరాటం, పోరాటం, మమకారం, నమ్మకం, నాయకత్వం..
No comments:
Post a Comment