చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు
నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు
ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకొంటే
చేయి జారి పోతుంటే జీవితాన్ని నిందించకు
కలం వ్రాయలేకుంటే కాగితాన్ని నిందించకు
గాలిలోన ఎగిరి పడే గడ్డిపరక ఊపిరెంత
ఏటిలోన తుళ్ళిపడే నీటి బుడగ ఉనికిఎంత
అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఎం లాభం
కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత
నడమంత్రపు సిరినేర్పిన దుడుకు బుద్ది దూకుడెంత
ఒక్క చినుకు చాలు మట్టి కుప్పను మొలిపించాలంటే
ఒక్క చెనుకు చాలు నవ్వుల చుక్కలు మెరిపించాలంటే
ఊహల్లో గీసుకొన్న యూహాలకు విలువేముంది
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరిలించాలంటే
ఒక్క కుదుపు చాలు పుడమి ముక్కను కదిలించాలంటే
విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగోస్తేనే
పరిణత మతి ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే
పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా..ఎలా..
పరమ నీతి మొలకెత్తదు ప్రమాణాలు చెల్లిస్తేనే..
అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే..
అలలు ఉప్పొంగే కడలికే ఆటైనా..పోటైనా...
చేవ ఉన్న వృక్షానికే చిగురైనా..చీడైనా....
రాశికి రావాలంటే విశేషమేదో ఉండాలి..
ప్రాణమున్న దేహానికే పడకైనా...నడకైనా..
రచ్చకెక్కు ఆసామికే రాల్లైనా..పూలైనా..
ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు
ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు
బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో
ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు
ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు
విధికి నీవు శిరసొగ్గితే విరుగుతుంది వెచ్చని రక్తం
సిరికి నీవు మనసోగ్గితే మరుగుతుంది ఆరని స్వార్ధం
నువ్వు పుట్టిందేందుకో తలను తట్టి తెలుసుకుంటే చాలు
ఉత్త అరుపులోనైనా వొలుకుతుంది చిక్కని అర్ధం
వోల్లకాటిలోనైనా పలుకుతుంది పచ్చని గీతం
తాడు బొంగరం లేక క్రీడ ఎలా చూపిస్తావు
నారు లేక నీరు లేక పైరు ఎలా పండిస్తావు
ఈ కబుర్ల టైర్ల గాలి ఎపుడో దిగిపోయిందబ్బో..
పదం లేక స్వరం లేక పాట ఎలా పలికిస్తావు
నిజాయితీకి కట్టుబడక ప్రజలను ఎలా పాలిస్తావు
----డా. సి. నారాయణ రెడ్డి
No comments:
Post a Comment