Sunday, January 20, 2013

నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం..


నా మనసేమి చెప్తుందో మీకందరికీ వినిపించాలని ఉంది 
మీకందరికీ చెప్పమని  అది నన్ను ఊపేస్తూ ఉంది..

అందరినీ పిలిచి అరచి చెప్పమంటుంది ..
సభలే పెట్టి విడమర్చి చెప్పమంటుంది...

చెప్పమంటారా ఆ లోతైన నిజం..
వినిపించమంటారా నా విన్నపం..

మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఈ  జీవితం..తరిగిపోతుంది మేలుకో   జీవితం..
చేయాలనుకున్న మంచిపనులు చేసి ఆనందించు   జీవితం 
నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం 

చెప్పాలి చెప్పాలి  అని లబ డబ మంటుంది నా గుండె చప్పుడు.. 
మీకు అర్దమయితే అదే పదివేలు అంటుంది నా పిలుపు..

మనలను ఉసికొలిపే  ఉత్పత్తులు..
మాయలో మనలను ముంచే ప్రలోభాలు..
మన చేత్తో మన కంటినే పొడుచుకొనేటట్లు చేసే అలవాట్లు..
ఇతరులను ముంచి ఎదగాలనే వెర్రి ఆలోచనలు..

బయట పడకపోతే ఎందుకూ పనికిరాదు మన జీవితం..
వినకపోతే విరిగిపోతుంది విలువైన నీ జీవితం..

విషాన్ని వెదజల్లుతున్న విద్వేషాలు..
అంతా మాకే కావాలనే ఆరాటాలు..
పనిచేయకుండా ఫలితాలు ఆశించే దురాశా పాశాలు..
కామంతో కళ్ళు మూసుకుపోయే క్రూరత్వాలు..

చివరకు మిగిలేది ఏమిటో జ్ఞానం లేకపోతే అంతా శూన్యం 
పోయేటప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంతా అయోమయం..

ముందుగా మేలుకొంటే మధురం ఈ జీవితం 
ఏడుస్తూ వచ్చాము...నవ్వుతూ ముగించాలి  ఈ జీవితం..
మనము పోయినా పదికాలాలు గుర్తుండాలి మన జీవితం..

మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు ఈ  జీవితం..తరిగిపోతుంది మేలుకో   జీవితం..
చేయాలనుకున్న మంచిపనులు చేసి ఆనందించు   జీవితం 
నిన్ను పక్కకు లాగే బలహీనతలకు లొంగిపోక సాగించు ఈ జీవితం..



No comments:

Post a Comment